
చౌటుప్పల్, వెలుగు : ముందు వెళ్తున్న కంటెయినర్ లారీ రోడ్డుపై సడన్‌గా ఆగిపోవడంతో వెనుకాల వచ్చిన ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టగా, ఆ బస్సును వెనుక నుంచి మరో బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో 13 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం స్టేజీ వద్ద బుధవారం తెల్లవారుజామున జరగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కంటెయినర్ లారీ ధర్మోజిగూడెం వద్దకు రాగానే బ్రేక్‌డౌన్ కావడంతో సడెన్‌గా హైవేపై ఆగిపోయింది.
ఇదే టైంలో వెనుక వచ్చిన ఆరంజ్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టడంతో, ఆ బస్సు వెనుక శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ఆరంజ్ ట్రావెల్స్ బస్సు శివనారాయణ రెండు కాళ్లు క్యాబిన్‌లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డాడు. బస్సులోని మరో 12 మందికి గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, సీఐ మన్మథకుమార్, ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను జేసీబీ సాయంతో బయటకు తీసి హాస్పిటల్‌కు తరలించారు. గాయపడిన మరో 12 మందిని చౌటుప్పల్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. మూడు భారీ వాహనాలు హైవేపై నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. పోలీసులు సుమారు గంటన్నర పాటు శ్రమించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు.