
- వీటిలో ఫస్ట్ ప్లేసులో అస్సాంలోని బైర్నీహాట్
- గ్లోబల్‌గా మోస్ట్ పొల్యూటెడ్ రాజధానిగా ఢిల్లీ
- వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టులో వెల్లడి
న్యూఢిల్లీ: మన దేశంలో మరిన్ని నగరాలు కాలుష్యకోరల్లో చిక్కుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కాలుష్యం నమోదవుతున్న టాప్ 20 సిటీల్లో 13 మన దేశంలోనే ఉన్నాయి. వీటిలో అస్సాంలోని బైర్నీహాట్ తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, ముల్లన్‌పూర్ (పంజాబ్), ఫరీదాబాద్ ( హర్యానా), లోనీ (యూపీ), న్యూఢిల్లీ, గురుగ్రామ్ (హర్యానా), గంగానగర్ (రాజస్థాన్), గ్రేటర్ నోయిడా (యూపీ), భివాడీ (రాజస్థాన్), ముజఫర్‌నగర్ (యూపీ), హనుమాన్‌గఢ్ (రాజస్థాన్), నోయిడా (యూపీ) ఉన్నాయి.
ఈ మేరకు స్విట్జర్లాండ్‌కు చెందిన ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ఎయిర్ రిపోర్టులో వెల్లడైంది. ఈ కంపెనీ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టు–2024ను మంగళవారం విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కాలుష్యం నమోదవుతున్న రాజధాని నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉందని అందులో పేర్కొంది. 2024లో ఢిల్లీలో కాలుష్యం ఏమీ తగ్గలేదని తెలిపింది.
2023తో పోలిస్తే తగ్గిన కాలుష్యం..
2023తో పోలిస్తే 2024లో మన దేశంలో కాలుష్యం కొంతమేర తగ్గింది. అత్యధిక కాలుష్యం నమోదవుతున్న దేశాల్లో 2023లో మూడో స్థానంలో ఉన్న ఇండియా.. 2024లో ఐదో ప్లేస్‌కు చేరింది. భారత్‌లో 2024లో పీఎం2.5 లెవల్స్ సగటు 7% తగ్గినట్టు రిపోర్టు తెలిపింది. 2023లో 54.4 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ ఉండగా, 2024లో 50.6 కు తగ్గినట్టు వెల్లడించింది.
సిటీల పరంగా చూస్తే టాప్ 20లో 13, టాప్ 10లో 6 ఇండియన్ సిటీలే ఉన్నాయని చెప్పింది. 35 శాతానికి పైగా సిటీల్లో పీఎం 2.5 లెవల్స్ 10 రెట్లకు పైగా అధికంగా ఉన్నట్టు పేర్కొంది. కాగా, దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రజల ఆయుర్దాయాన్ని 5.2 ఏండ్లు తగ్గిస్తున్నదని నిపుణులు అంచనా వేశారు. ఇండియాలో 2009 నుంచి 2019 వరకు ఏటా 15 లక్షల మంది కాలుష్య సంబంధిత వ్యాధులతో చనిపోయారని లాన్సెట్ పోయినేడాది విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.