తమిళనాడులో విషాదం... కల్తీ మందు తాగి 13 మంది మృతి

కల్తీ మందు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. దీనిపై నిషేధం ఉన్నా కొందరు అధికారుల అండదండలతో యథేచ్ఛగా అమ్ముతున్నారు. తమిళనాడులోని వేర్వేరు జిల్లాల్లో కల్తీ మందు తాగి ఒకే రోజు 13 మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విల్లుపురం జిల్లా మరక్కానంలో, చెంగల్​పట్టు జిల్లా మదురాంతకం లో కల్తీ మందు అమ్మారు. అది తాగిన గ్రామస్థులలో చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా 13 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో 30 మంది ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వారు తెలిపారు.

విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు రెండు జిల్లాల నుంచి ముగ్గురు ఇన్ స్పెక్టర్​, నలుగురు సబ్ ఇన్​స్పెక్టర్లను అధికారులను ఉన్నతాధికారులు ప్రభుత్వం సస్పెండ్​ చేసింది. కల్తీ మద్యం, గుట్కా తయారు చేసి సరఫరా చేసిన 9 మందిని గుర్తించి 57 కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. పలువురు నిందితులు పరారీలో ఉన్నారని వారు చెప్పారు. రెండు ఘటనల్లోనూ పారిశ్రామిక అవసరాలకు వినియోగించే ఇథనాల్​మిథనాల్​ పదార్థాన్ని మందులో కలిపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

కల్తీ మద్యం ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందించనున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్​ తెలిపారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు పరిహారంగా ఇవ్వాలని నిర్ణయించారు. కల్తీ మద్యం తాగడం వల్ల మరణాలు సంభవించడం బాధాకరమని స్టాలిన్​ ఆవేదన వ్యక్తం చేశారు.  నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.