ఒకే గ్రామంలో 13 మందికి అస్వస్థత

ఒకే గ్రామంలో 13 మందికి అస్వస్థత

పాల్వంచ రూరల్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాత సూరారం గ్రామంలో ఒకే వీధికి చెందిన 13 మంది ఒకేసారి అస్వస్థతకు గురయ్యారు. బాధితులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారం గ్రామానికి చెందిన కుంజా శాంతి, బట్టు సూర్యనారాయణ, మెప్పా లక్ష్మి, సోయం బాలరాజు, యాకూబ్​, ఆదినారాయణ, నాగమణి, తాటి రాము, పర్సా వీరభద్రం, కోరగట్టు సత్యనారాయణ, మడవి సుశీలతోపాటు మరో ఇద్దరు శుక్రవారం పాల్వంచ పట్టణంలోని గుడిపాడులోని ఓ శుభకార్యానికి వెళ్లి వచ్చారు. 

శనివారం వారి స్వగ్రామంలోనే మరో ఫంక్షన్​కు అటెండ్​అయ్యారు. కొంతసేపు తర్వాత ఆ 13 మందికి వాంతులు, విరోచనాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు వారందరినీ 108 అంబులెన్స్​లో కొత్తగూడెంలోని గవర్నమెంట్​ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. వారిలో యాకూబ్, ఆదినారాయణ పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పాల్వంచ ఎంపీడీవో విజయభాస్కర్​రెడ్డి, పలువురు వైద్యులు సూరారం గ్రామానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.  గ్రామంలో మంచినీటి శాంపిల్స్​ను ​టెస్ట్ ​కోసం ల్యాబ్‌‌కు  పంపించామని ఎంపీడీవో తెలిపారు. ప్రస్తుతం బాధితులందరి ఆరోగ్యం నిలకడగావుందని వైద్యులు తెలిపారు.