కెమికల్​ కలిసిన నీళ్లు తాగి 13 గొర్రెలు మృతి 

కెమికల్​ కలిసిన నీళ్లు తాగి 13 గొర్రెలు మృతి 
  • బ్లాస్టింగ్ ​మొలాసిస్ ​కలవడంతో మృత్యువాత  

పెనుబల్లి, వెలుగు :  బ్లాస్టింగ్​ మొలాసిస్​ కలిసిన నీటిని తాగడంతో 13గొర్రెలు చనిపోయాయి. బాధితుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రారావు బంజర్​గ్రామానికి చెందిన బోలె రాంబాబు 100గొర్రెలను మేపుతూ లంకాసాగర్​ క్రాస్​రోడ్​లోని పంజాబీ దాబా రెస్టారెంట్​లో ఉన్న బీడు భూమిలోకి తోలుకెళ్లాడు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీరు నిల్వ ఉండడంతో ఆ నీళ్లను తాగిన13గొర్రెలు అక్కడే పడిపోయాయి. రైతు ఏమైందని చూడగా అక్కడ ఆగి ఉన్న ఓ లారీ ట్యాంకర్​నుంచి కెమికల్​లీకై ఆ వాటర్​లో కలుస్తోంది.

వెంటనే స్థానిక వీఎం  బంజర్​పోలీసులతో పాటు వెటర్నరీ డిపార్ట్​మెంట్​కు సమాచారం ఇచ్చాడు. ఆరు నెలలుగా హైదరాబాద్​కు చెందిన ఓ ప్రైవేట్​కంపెనీ సత్తుపల్లి సింగరేణిలోకి బ్లాస్టింగ్​మొలాసిస్​సప్లై చేస్తోంది. దీన్ని గనుల్లో పేలుడుకు ఉపయోగిస్తారు. వీరికి స్టోరేజ్​లేకపోవడంతో పెనుబల్లి మండలంలోని లంకాసాగర్​ అడ్డా రోడ్​లోని దాబా వెనుక ఒక లారీ ట్యాంకర్​ నుంచి మరో ట్యాంకర్​ లోకి మారుస్తుండగా మొలాసిస్​లీక్​ అవుతోంది. రెండు నెలలు క్రితం వరకు వర్షాలు లేకపోవడంతో మొలాసిస్​ఎండకు ఆవిరయ్యేది. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు ట్యాంకర్ల దగ్గర నీరు నిల్వ ఉండడంతో మొలాసిస్​ ఆ నీటిలో కలిసింది. ఆ నీళ్లను తాగిన గొర్రెలు చనిపోయాయి. అధికారులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.