- పీఓఎస్ఓసీఓ నుండి విద్యుత్ కొనకుండా నిషేధం..
- నిన్న అర్ధరాత్రి నుండే అమల్లోకి
న్యూఢిల్లీ: కేంద్ర విద్యుత్ శాఖ 13 రాష్ట్రాలకు షాక్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలు సహా 13 రాష్ట్రాలకు చెందిన విద్యుత్ పంపిణీ సంస్థలు ఇంధన ఎక్స్ఛేంజీల నుంచి జరిపే రోజువారీ కరెంటు కొనుగోళ్లను కేంద్రం నిషేధించింది. ఈ నిషేధాన్ని వెంటనే (ఈనెల 18వ తేదీ అర్ధరాత్రి నుండి) అమలులోకి తీసుకొస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియన్ పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పోరేషన్ (పీఓఎస్ఓసీఓ) నుండి విద్యుత్ కొనుగోలు చేయకుండా కేంద్ర విద్యుత్ శాఖ తీసుకున్న నిర్ణయం తెలంగాణ, ఏపీ సహా 13 రాష్ట్రాల డిస్కంలకు షాకిచ్చింది.
ఆయా రాష్ట్రాలు బకాయిలు చెల్లించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ చెబుతోంది. కేంద్రం వివరాల ప్రకారం తెలంగాణ రూ. 1380 కోట్లు, ఏపీ రూ.412 కోట్లు, తమిళనాడు రూ. 924 కోట్లు, రాజస్థాన్ రూ.500, జమ్మూ కాశ్మీర్ రూ. 434కోట్లు, మహారాష్ట్ర 381, చత్తీస్ గఢ్ రూ. 274కోట్లు, మధ్యప్రదేశ్ రూ. 230 కోట్లు, జార్ఖండ్ రూ.218 కోట్లు, బీహార్ రూ. 112 కోట్లు చొప్పున, మొత్తం సుమారు 5800కోట్లు బకాయి పడినట్లు తెలుస్తోంది. ఈ బకాయిలు చెల్లించలేదన్న కారణం చూపి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కేంద్ర విద్యుత్ శాఖ నిర్ణయంపై ఉన్నతాధికారులు పరోక్షంగా స్పందించారు. 13 రాష్ట్రాలు మొత్తం 1 లక్షా 43వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వాలు డిస్కంలకు చెల్లిస్తే.. డిస్కంలు వెంటనే జెన్ కోల బకాయిలు చెల్లించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కేంద్ర విద్యుత్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణ అధికారులు విస్మయానికి గురిచేసినట్లు తెలుస్తోంది. బకాయిల చెల్లింపు విషయం కోర్టులో ఉందని, కేంద్ర నిర్ణయంతో రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నట్లు సమాచారం.