చనిపోయిన 13వేల బాతు పిల్లలు.. గుండెపోటుతో యజమానురాలి కన్నుమూత

సత్తుపల్లి, వెలుగు :  తుఫాన్ కారణంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని కిష్టాపురంలో సుమారు 13 వేల బాతు పిల్లలు చనిపోయాయి.  విషయం తెలిసిన వెంటనే వాటి యజమానురాలు గుండెపోటుతో కన్నుమూసింది. ఆంధ్రప్రదేశ్​లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఏడుకొండలు తన భార్య రమాదేవి, కొడుకు నాగార్జున, తల్లి ఆదిలక్ష్మితో కలిసి 2 నెలల క్రితం కిష్టాపురం వలస వచ్చాడు.

ఊరి చివరలోని వరి పొలాల్లో ఉంటూ బాతులను మేపుకుంటున్నారు. మంగళవారం రాత్రి తుఫాన్ రావడంతో చలికి బాతు పిల్లలు చనిపోయాయి. వీటి విలువ సుమారు రూ.15 లక్షల వరకు ఉంటుంది. బాతు పిల్లలు చనిపోవడాన్ని చూసిన ఆదిలక్ష్మి గుండెపోటుతో అక్కడికక్కడే చనిపోయింది.