సికింద్రాబాద్ నుంచి 9 రైళ్లలో 13 వేల మంది

థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే స్టేషన్‌లోకి పర్మిషన్
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఏడురోజుల క్వారంటైన్

సికింద్రాబాద్, వెలుగు: దాదాపు రెండు నెలల తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్యాసింజర్లతో సోమవారం కళకళలాడింది. లాక్ డౌన్ సడలింపులో భాగంగా రైళ్ల రాకపోకలకు కేంద్రం గ్రీన్​సిగ్నల్ ఇచ్చింది. టికెట్లు రిజర్వేషన్​ చేసుకున్న ప్రయాణికులు రైలు బయలుదేరే సమయానికి 90 -నుంచి 120 నిమిషాల ముందే రావాలని అధికారులు సూచించడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచే కొందరు రైల్వే స్టేషన్​కు చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజామున ప్రయాణికులు పెద్దసంఖ్యలో స్టేషన్‌‌కు వచ్చారు. దీంతో భారీ క్యూలైన్‌‌ ఏర్పడింది. రైల్వే స్టేషన్​ పరిసరాలు, రోడ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ప్యాసింజర్ల బంధువులు,స్నేహితులను స్టేషన్​ లోపలికి అనుమతించలేదు. రైల్వే అధికారులు థర్మల్​ స్క్రీనింగ్​తర్వాతే ప్యాసింజర్లను స్టేషన్ లోకి అనుమతించారు. ఒకటి, పదో ప్లాట్​ఫారాల నుంచే రైళ్ల రాకపోకలు సాగించారు. రైలు ఎక్కేందుకు వెళ్లే ప్రయాణికులను  మూడో నంబరు ప్లాట్​ఫారం ద్వారా లోపలికి అనుమతించారు. బయటకు వెళ్లే  ప్రయాణికులను నాలుగో నంబర్ ప్లాట్​ఫారం ద్వారా పంపించారు.

తెలంగాణ ఎక్స్ ప్రెస్‌తో స్టార్ట్

సికింద్రాబాద్​నుంచి 33 రైళ్లు నడుస్తుండగా, మొదటి రోజు 9 రైళ్లు రాకపోకలు సాగించాయి.  సోమవారం ఉదయం 6 గంటలకు తెలంగాణ ఎక్స్ ప్రెస్ నాంపల్లి స్టేషన్‌‌ నుంచి సికింద్రాబాద్ స్టేషన్​కు చేరుకుంది. ఉదయం 6.55 గంటలకు ఢిల్లీకి బయలుదేరింది. తర్వాత సికింద్రాబాద్‌‌ నుంచి దానాపూర్‌‌ ఎక్స్‌‌ప్రెస్, మధ్యాహ్నం సికింద్రాబాద్‌‌ నుంచి గుంటూరు వెళ్లే గోల్కొండ ఎక్స్‌‌ప్రెస్ బయలుదేరాయి. ముంబై వెళ్లే హుస్సేన్‌‌సాగర్‌‌ ఎక్స్‌‌ప్రెస్,  హౌరా వెళ్లే ఫలక్‌‌నుమా ఎక్స్‌‌ప్రెస్, సాయంత్రం నిజామాబాద్‌‌ నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్‌‌ప్రెస్,  విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్‌‌ప్రెస్‌‌, అమృత్​సర్​- సచ్ ఖండ్​ ఎక్స్​ప్రెస్​,  హైదరాబాద్​-ముంబై సీఎస్​టీ ఎక్స్​ప్రెస్ లు బయలుదేరి వెళ్లాయి.

బోగీలో 52 మంది..

ప్రతి బోగీలో 72 సీట్లకు గాను 52 మందిని మాత్రమే అనుమతించారు. రైలులో మంచినీరు,భోజనం వంటివి అందించబోమని, స్వంతంగా తెచ్చుకోవాలంటూ రైల్వే టీసీలు ప్రయాణికులకు స్పష్టంగా చెప్పారు. ఏసీ బోగీల్లో దుప్పట్లు ఇవ్వట్లేదన్నారు. విశాఖపట్నం ఇతర రాష్ట్రాల నుంచి​సిటీకి వచ్చిన ప్రయాణికులను ఏడు రోజులపాటు క్వారంటైన్​లో ఉండాల్సిందేనని సూచించారు. 9 రైళ్ల ద్వారా 13 వేల మంది ప్యాసింజర్లు బయలుదేరి వెళ్లారు.

అన్ని జాగ్రత్తలు తీసుకున్నం
సుదీర్ఝ కాలం తర్వాత రైళ్లు స్టార్ట్ కావడంతో ప్రయాణికుల భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం . ప్రతి ప్రయాణికుడిని థర్మల్ స్క్రీనింగ్ చేసి లోపలికి పంపాం. స్టేషన్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాం. స్టేషన్‌లో క్యాంటీన్లు ​ఓపెన్ చేసి టేక్ అవే సదుపాయం కల్పించాం.
– జయరామ్, సికింద్రాబాద్ స్టేషన్ డైరెక్టర్

For More News..

నేడు, రేపు వెబ్ కౌన్సిలింగ్

చైనా సైనికులకు ఆయుధాలను మనమే కొనిస్తున్నం