Bharatanatyam: భరత నాట్యంతో చరిత్ర సృష్టించిన చైనా అమ్మాయి.. వీడియో చూడండి..

Bharatanatyam: భరత నాట్యంతో చరిత్ర సృష్టించిన చైనా అమ్మాయి.. వీడియో చూడండి..

బీజింగ్: భారతీయ ప్రాచీన నృత్య కళ భరత నాట్యానికి చైనాలో అరుదైన గౌరవం దక్కింది. చైనాకు చెందిన 13 ఏళ్ల బాలిక భరత నాట్య ప్రదర్శనతో అదరగొట్టింది. ఆ బాలిక భరత నాట్య ప్రదర్శన చూడటానికి వెళ్లిన చైనీయులు కరతాళ ధ్వనులతో భారతీయ నృత్య కళకు జేజేలు పలికారు. భరతనాట్యంలో ‘‘ఆరంగేట్రం’’ ప్రదర్శన ఇచ్చిన ఆ చైనా బాలిక పేరు లీ ముజీ. ఆదివారం నాడు ఈ బాలిక ఇచ్చిన భరత నాట్య ప్రదర్శనకు ఆడిటోరియం చప్పట్లతో మోత మోగిపోయింది. దాదాపు 2 గంటల పాటు లీ ప్రదర్శన సాగింది.

 

లీ ముజీ బాల్యం నుంచే భరతనాట్యంపై మక్కువ పెంచుకుంది. 2014 నుంచే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది. చైనాలో పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకుని ‘‘ఆరంగేట్రం’’ ప్రదర్శన ఇచ్చిన తొలి చైనా విద్యార్థిని లీ ముజీనే కావడం విశేషం. చైనీస్ భరత నాట్యం డ్యాన్సర్ జిన్ షాన్ షాన్ ఈ విద్యార్థినికి శిక్షణ ఇచ్చారు. ఈ ఆరంగేట్రం ప్రదర్శనకు ఇండియన్ అంబాసిడర్ ప్రదీప్ రావత్ భార్య శృతి రావత్ ముఖ్య అతిథిగా వెళ్లారు. ఈ ప్రదర్శన వీక్షించేందుకు భరత నాట్యంపై మక్కువ పెంచుకున్న చైనీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. లీ ముజీ ప్రదర్శనతో చైనాకు మన భారతీయ ప్రాచీన నృత్య కళ గొప్పతనం చాటి చెప్పినట్టయింది. 

చైనాలోని జిన్ డ్యాన్స్ స్కూల్లో లీ భరత నాట్యంలో కొన్నేళ్ల నుంచి శిక్షణ పొందింది. ఆగస్ట్ నెలాఖరులో లీ ముజీ మన దేశంలో కూడా ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ నెలాఖరులో చెన్నైలో లీ ముజీ భరత నాట్య ప్రదర్శన ఉండబోతున్నట్లు సమాచారం. భారతీయ నృత్య రూపాల్లో భరత నాట్యానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. విస్తృత భంగిమలతో హావ, భావాలను వ్యక్తపరుస్తూ శాస్త్రీయ నృత్య విధానంతో అందరినీ ఆకట్టుకునే భరత నాట్యం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు.