వనపర్తి, వెలుగు : ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెడితే డబుల్ వస్తాయంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు రూ. 1.30 కోట్లు వసూలు చేశారు. వనపర్తికి చెందిన ఓ రైస్ మిల్ వ్యాపారి ఆన్‌లైన్ పెట్టుబడి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని డబ్బులు పెట్టడం ప్రారంభించాడు. పెట్టుబడి పెట్టిన మరుసటి రోజే అదనంగా డబ్బులు వచ్చాయి. ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తి పరిచయం చేసుకొని తాను చెప్పిన టైంలోనే డబ్బులు పెట్టుబడి పెట్టాలని, అలా అయితే రెండింతలు వస్తాయని నమ్మించాడు.
దీంతో సదరు వ్యాపారి పలు దఫాలుగా రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టడంతో అదనంగా డబ్బులు వచ్చాయి. పది రోజుల కింద ఏకంగా రూ. కోటి పెట్టుబడి పెట్టగా మరుసటి రోజే రూ.1.05 కోట్లు వచ్చాయి. దీంతో ఇంకా డబ్బులు వస్తాయని నమ్మిన వ్యాపారి మూడు, నాలుగు రోజుల కింద రూ.1.30 కోట్లు పెట్టాడు.
తర్వాతి రోజు నుంచే యాప్ పనిచేయకపోగా, ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తి చాటింగ్ బంద్ కావడంతో మోసపోయినట్లు గుర్తించాడు. హైదరాబాద్‌లోని డీఐజీ ఆఫీస్‌లో తనకు పరిచయం ఉన్న వారిని సంప్రదించి సైబర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.