130 అణ్వాయుధాలు మీ కోసమే.. రెచ్చగొడితే యుద్ధమే.. భారత్‎కు పాక్ మంత్రి ఓపెన్ వార్నింగ్

130 అణ్వాయుధాలు మీ కోసమే.. రెచ్చగొడితే యుద్ధమే.. భారత్‎కు పాక్ మంత్రి ఓపెన్ వార్నింగ్

ఇస్లామాబాద్: దాయాది పాకిస్థాన్ నేతలు భారత్‎పై తమ అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఉగ్రవాదులను పెంచి పోషించి భారత్‎పై దాడులకు ప్రేరేపించడమే కాకుండా.. మీదికెళ్లి మన దేశానికే వార్నింగులు ఇస్తున్నారు. సింధు నదిలో నీళ్లు పారకుంటే భారతీయుల రక్తం పారుతుందని పాకిస్థాన్ మంత్రి భుట్టో కారుకూతలు కూయగా.. తాజాగా మరో పాక్ మంత్రి భారత్‎పై తమ ద్వేషం ఏ స్థాయిలో ఉందో చూపేలా బహిరంగంగా హెచ్చరించాడు. 

పహల్గాం ఉగ్రదాడి, సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడంపై పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసి ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పాకిస్తాన్‎కు నీటి సరఫరాను నిలిపివేయడానికి భారతదేశం ధైర్యం చేస్తే.. అప్పుడు భారత్ పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధం కావాలని హెచ్చరించాడు. పాకిస్థాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలు కేవలం ప్రదర్శన కోసమే కాదని.. తమను రెచ్చగొడితే దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయని బహిరంగంగా బెదిరించాడు.

పాకిస్తాన్ ఆయుధాగారంలోని- ఘోరీ, షాహీన్, ఘజ్నవి క్షిపణుల వంటి130 అణ్వాయుధాలను -కేవలం భారత్ కోసం మాత్రమే దాచి ఉంచామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి దేశంలో ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదని.. కానీ ఆ అణ్వాయుధాలన్నీ భారత్‎ను టార్గెట్ చేసి ఉన్నాయన్నారు. 

పాకిస్థాన్‏తో వాణిజ్య సంబంధాలు తెంచుకుంటే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో భారత్ ఇప్పుడే అర్థం అవుతోందని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ తన గగనతలాన్ని భారత విమానాలకు మూసివేయడం వల్ల కేవలం రెండు రోజుల్లోనే భారత విమానయానంలో తీవ్ర గందరగోళం నెలకొన్నదని ఆరోపించారు. ఇంకో 10 రోజులు ఇలాగే కొనసాగితే భారతదేశంలోని విమానయాన సంస్థలు దివాలా తీస్తాయని పేర్కొన్నారు. 

పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత్ తన భద్రతా వైఫల్యాలను అంగీకరించడానికి బదులుగా పాకిస్తాన్‌పై నిందలు మోపుతోందని బుకాయించారు. పాక్‎తో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని ఢిల్లీ నిర్ణయం తీసుకోవడంతో.. తర్వాత జరిగే పరిణామాలను ఎదుర్కొనేందుకు  ఇస్లామాబాద్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.