- కరీంనగర్ సిటీలోనే 1300 మరణాలు
- కరోనా చావులపై బట్టబయలైన సర్కార్ కాకి లెక్కలు
- ఆరు నెలల్లో ఈ ఒక్క జిల్లాలోనే 2 వేలకు మందికి పైగా మృతి
- ఆర్టీ దరఖాసుత్తో వివరాలు బహిర్గతం
- సర్కార్ లెక్క 478 మందే.. రాష్ట్రమంతా 4 వేల లోపే
కరీంనగర్, వెలుగు: కరోనా మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న కాకి లెక్కలు కరీంనగర్ సాక్షిగా బయటపడ్డాయి. జనవరి నుంచి జూన్ దాకా ఈ జిల్లాలో 478 మంది కరోనాతో చనిపోయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ లెక్కలు చెప్తున్నాయి. కానీ, ఒక్క కరీంనగర్ కార్పొరేషన్పరిధిలోనే 1,295 కరోనా డెత్‌సర్టిఫికెట్లు జారీ చేసినట్లు తాజాగా వెల్లడైంది. జిల్లాలోని మిగిలిన మున్సిపాలిటీలు, గ్రామాల్లో మరో వెయ్యి మంది కరోనాతో చనిపోయినట్లు తెలుస్తోంది. అంటే కరీంనగర్ జిల్లాలోనే దాదాపు 2 వేల మందికిపైగా కరోనాతో చనిపోయారు. 6 నెలల్లో ఒక్క జిల్లాలోనే ఇంత మంది చనిపోతే.. రాష్ట్రవ్యాప్తంగా ఇంకెంత మంది చనిపోయి ఉంటారనేదానికి సమాధానం లేదు. ఎందుకంటే పోయినేడు మార్చి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 3,759 మందే చనిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. కరీంనగర్‌కు చెందిన ‘ప్రజా ప్రయోజనాల పరిరక్షణ సమితి’ అనే స్వచ్ఛంద సంస్థ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ జనన, మరణ రిజిస్ట్రేషన్ల విభాగాల నుంచి ఈ ఏడాది జూన్ దాకా కరోనా మరణాల లెక్కలను సేకరించడంతో ఈ విషయాలు బయటకు వచ్చాయి.
పొంతన లేని లెక్కలు..
నిరుడు కరోనా మొదలైనప్పటి నుంచి కేసులు, మరణాలను ప్రభుత్వం తక్కువ చేసి చూపుతోందనే ఆరోపణలున్నాయి. ద్వారా సేకరించారు. ఈ 3 విభాగాలు ఇచ్చిన వివరాలు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ చెప్పిన వివరాల ప్రకారం జనవరి నుంచి జూన్ దాకా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కేవలం 478 మంది చనిపోయారు. అదే సమయంలో ఒక్క కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ జనన, మరణ రిజిస్ట్రేషన్ల విభాగం.. ప్రైవేట్హాస్పిటల్స్లో 756 మంది, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మరో 539 మంది చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్లు జారీ చేసింది.
వేలల్లో ఉన్నా..
జనవరి, జూన్ మధ్య కరీంనగర్ టౌన్ లో 1,295 మంది చనిపోగా.. జిల్లాలోని జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీలతో పాటు 317 గ్రామ పంచాయతీలలో జారీ అయిన కరోనా డెత్ సర్టిఫికెట్లను కూడా కలిపితే ఈ సంఖ్య మరో వెయ్యికి పైగా ఉండే చాన్స్ఉంది. ఈ లెక్కన కరీంనగర్ జిల్లాలో 2 వేల మందికి పైగా కరోనాతో చనిపోయినట్లు అర్థమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో చనిపోయినవాళ్లు 4 వేల కన్నా తక్కువని సర్కారు చూపుతోంది. పోస్ట్ కొవిడ్ సమస్యలతో చనిపోయిన వాళ్లకూ కరోనా డెత్ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కరోనాతో చనిపోయిన కుటుంబాలకు ‘స్మైల్’ లాంటి స్కీమ్స్ కింద ఆర్థిక సాయం అందిస్తోంది. రాష్ట్రం కరోనా మరణాలను దాయడంతో బాధిత ఫ్యామిలీలు నష్టపోయే
పరిస్థితి ఏర్పడింది.
ప్రతి నెలా 100 మందికి అంత్యక్రియలు
కరీంనగర్ అలకాపురి శ్మశానవాటికలో గతంలో నెలకు 15 నుంచి 20 వరకు డెడ్‌బాడీలకు అంత్యక్రియలు జరిగేవి. పోయినేడు కరోనా మొదలయ్యాక ఇక్కడ ప్రతి నెలా 80 నుంచి 100 డెడ్‌బాడీలకు అంత్యక్రియలు జరుగుతున్నాయని నిర్వాహకులు చెప్తున్నారు. కరోనా పీక్‌స్టేజ్‌లో ఉన్న మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కరీంనగర్ మానేరు నదీ తీరంలో వరుసగా చితులు పేర్చి ఒక్కో రోజు పది నుంచి పదిహేను మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
లెక్కలు దాసుడెందుకు?
వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ ఆఫీసర్లు, జిల్లా ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చిన కరోనా మరణాల లెక్కలకు పొంతన ఉంటలేదు. చాలా మంది కరోనాతో చనిపోయినా.. లంగ్స్ ప్రాబ్లమ్, బ్రీతింగ్ ప్రాబ్లమ్ తో చనిపోయినట్లు రాసి ఇచ్చారు. అవి కూడా కలిపితే కరోనా మరణాల లెక్క మరింత పెరుగుతుంది. కరోనాతో చనిపోయిన వాళ్ల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఇలాంటి టైంలో కొన్ని రాష్ట్రాలు వాస్తవ మరణాలు బయటపెడుతున్నా మన రాష్ట్రం మాత్రం ఇంకా దాస్తోంది. ఇది కరెక్టు కాదు.
- మహ్మద్ అమీర్, సామాజిక కార్యకర్త, కరీంనగర్