13.5 కేజీల హాష్ ఆయిల్ పట్టివేత... ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్స్​ స్మగ్లర్ల అరెస్టు 

13.5 కేజీల హాష్ ఆయిల్ పట్టివేత... ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్స్​ స్మగ్లర్ల అరెస్టు 

మల్కాజిగిరి, వెలుగు: హాష్ ఆయిల్​ను తరలిస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను ఎల్ బీనగర్ ఎస్ఓటీ, హయత్​నగర్​పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద 13.5 కేజీల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకోగా.. దీని విలువ సుమారు రూ.1.8 కోట్లు ఉంటుంది. నేరెడ్ మెట్ లోని రాచకొండ కమిషనరేట్ లో  సీపీ సుధీర్​బాబు సోమవారం మీడియాకు వివరాలు తెలిపారు. ఏపీలోని వైజాగ్ ప్రాంతం నుంచి వంచుర్ల కొండబాబు(30), అల్లూరి సీతారామరాజు జిల్లాకు వంచుర్ల బాలకృష్ణ(20) బంధువులు. ఇద్దరూ వ్యవసాయ పనులు చేస్తుంటారు. కొండబాబు అన్నవరంలో ప్రతి వారం జరిగే పశువుల సంతకు వెళ్తుంటాడు.

అక్కడ కొద్ది నెలల కిందట అతనికి ఓ వ్యక్తి పరిచయమై, డ్రగ్స్ అమ్మితే ఎక్కువగా డబ్బులు వస్తాయని ఆశచూపాడు.  అప్పటికే  డ్రగ్స్​అమ్ముతూ పట్టుబడి జైలుకు వెళ్లిన బాలకృష్ణకు కొండబాబు విషయం చెప్పగా అంగీకరించి.. డ్రగ్స్ రవాణా మొదలుపెట్టారు. ఇద్దరూ వైజాగ్, ఒడిశాలోని అటవీ ప్రాంతాల్లో హాష్ ఆయిల్ తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్​కు తీసుకొచ్చేవారు.  ఇక్కడ నుంచి బెంగళూరుకు చెందిన రిసీవర్ తీసుకుని వెళ్లేవాడు.

కొద్దిరోజుల కిందట బెంగళూరు కు చెందిన డ్రగ్స్​రిసీవర్​కొండబాబుకు ఫోన్​చేసి ఆర్జంట్ గా14 కేజీల హాష్  ఆయిల్ కావాలని కోరారు.  దీంతో కొండబాబు, బాలకృష్ణ గత శనివారం హాష్ ఆయిల్ కొనుగోలు చేసి తీసుకుని సిటీకి వచ్చారు. పెద్ద అంబర్​పేట వద్ద తాజాఫుడ్స్​హో టల్​లో బెంగళూరుకు చెందిన డ్రగ్స్​రిసీవర్​వెయిట్ చేస్తుండగా.. సమాచారం అందడంతో  పోలీసులు వెళ్లి రైడ్ చేశారు. నిందితుల బ్యాగులు చెక్​ చేయగా హాష్ ఆయిల్ దొరికింది. వారిని అరెస్ట్ చేసి 2 సెల్​ఫోన్లు, రూ.2వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సుధీర్​బాబు తెలిపారు. ప్రధాన రిసీవర్ పరారీలో ఉన్నాడు.