నల్ల బంగారంతో.. సింగరేణి వెలుగులు.. ఇయ్యాల్టితో 136 వసంతంలోకి సంస్థ

నల్ల బంగారంతో.. సింగరేణి వెలుగులు.. ఇయ్యాల్టితో 136 వసంతంలోకి సంస్థ
  • నల్ల బంగారంతో.. సింగరేణి వెలుగులు..ఇయ్యాల్టితో 136 వసంతంలోకి సంస్థ
  •  ఏడాదికి రూ.36వేల కోట్ల టర్నోవర్ 
  • గత ఆరునెలల్లో రూ. 3వేల కోట్ల లాభం 
  •  త్వరలోనే నైనీ బ్లాక్​లో బొగ్గు తవ్వకాలు
  •  విస్తరణపై ఫోకస్ చేసిన అధికారులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: తెలంగాణకే తలమానికమైన సింగరేణి కాలరీస్​కంపెనీ చరిత్రలో మరో ఏడాది ముగియనుంది. 135 ఏండ్లుగా బొగ్గు తవ్వకాలు కొనసాగిస్తూ.. ఇయ్యాల్టి నుంచి136 వసంతంలోకి అడుగుపెడుతోంది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ దేశంలోని నవరత్న కంపెనీలకు దీటుగా లాభాలు సాధిస్తోంది. ఏడాదికి దాదాపు రూ. 36వేల కోట్ల టర్నోవర్​లక్ష్యంగా సింగరేణి పరుగులు పెడుతోంది.  2024–25 ఆర్థిక సంవత్సరంలోని ఆరునెలల్లో  రూ.3 వేల కోట్ల లాభాలను గడించింది.  ఒడిశాలోని నైనీ కోల్​బ్లాక్​లో రెండు, మూడు నెలల్లో కొత్తగా బొగ్గు తవ్వకాలను చేపట్టనుంది. వ్యాపార విస్తరణపైనే ప్రధానంగా సంస్థ దృష్టి పెడుతోంది.  భవిష్యత్‎లోనూ ఉన్నతస్థాయికి ఎదిగేందుకు యాజమాన్యం ప్రణాళికలను రూపొందించుకుంటూ ముందుకుసాగుతోంది.

ఈసారి రూ. వెయ్యి కోట్లు ఎక్కువగా..  

2024–25 ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్​రూ. 36 వేల కోట్లు సాధించేందుకు సంస్థ తీవ్రంగా కృషి చేస్తోంది. గత ఏప్రిల్​నుంచి సెప్టెంబర్​ వరకు ఆరునెలల్లో దాదాపు రూ.3 వేల కోట్లు లాభం సాధించింది. గతేడాది ఇదే సమయంలో  రూ. 2వేల కోట్లు మాత్రమే వచ్చింది. ఈసారి రూ. వెయ్యి కోట్లు అదనంగా పొందింది. ఇలా అత్యధిక టర్నోవర్‎తో పాటు అధిక లాభాలు సాధించేలా సంస్థ ప్రణాళికలను తయారు చేసుకుంటోంది.   

 విదేశాల్లోనూ కోల్ మైన్స్‎పై ఫోకస్

విదేశాల్లోనూ కోల్​మైన్స్‎ను చేపట్టేందుకు సింగరేణి ప్రణాళికలను రూపొందించింది. ఇప్పటికే కన్సల్టెన్సీలను కూడా నియమించుకుంది. బొగ్గు తవ్వకాలకే పరిమితం కాకుండా థర్మల్​విద్యుత్​పవర్​లో సక్సెస్​ రేటు సాధించి, ఇతర పరిశ్రమలపైనా దృష్టి కేంద్రీకరించింది. మరో వైపు దేశంలోనే అద్భుతమైన థర్మల్ విద్యుత్​కేంద్రంగా ఎస్టీపీపీ గుర్తింపు పొందింది. ఇక్కడ మరో 800 మెగావాట్ల ఫ్లోటింగ్​సోలార్ విద్యుత్​ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. దీనిపై డీపీఆర్​కూడా సిద్ధం చేసుకోగా..  వచ్చే ఏప్రిల్‎లో ప్రారంభించేలా ముందుకెళ్తోంది. 

ఇలా రాష్ట్రంలోని నీటి వనరులు, రిజర్వాయర్లల్లో ఫ్లోటింగ్ సోలార్​ విద్యుత్​ఉత్పత్తికి కృషి చేస్తోంది. సోలార్, థర్మల్​విద్యుత్​ప్రాజెక్టులకు దాదాపు రూ. 55వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టేలా సింగరేణి  ముందుకుసాగుతోంది. మరోవైపు మణుగూరు ఏరియాలో జియో థర్మల్​స్టేషన్​ఏర్పాటుకు ఓఎన్ జీసీతో కలిసి సంస్థ రీసెర్చ్​చేస్తోంది. ఇవేకాకుండా లిథియం, ఇథనాల్ వంటి ఖనిజాల తవ్వకాలకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తోంది. కొత్త మైన్స్​తో పాటు పలు మైన్స్​ఎక్స్​టెన్షన్స్​, అవసరమైన పర్మిషన్స్​కు  సింగరేణి సీఎండీ బలరామ్ కృషి చేస్తున్నారు.  

సీఎస్ఆర్ ఫండ్స్ కింద నిధులిస్తూ..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సింగరేణి బంగారు బాతుగుడ్డుగా మారింది. ప్రతి ఏడాది సెస్​, ఇతరత్రా పన్నుల రూపేణా రూ. వేల కోట్లు చెల్లిస్తోంది. అంతేకాకుండా సీఎస్ఆర్ ఫండ్స్​పేరిట అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎమ్మెల్యేలకు నిధులను కేటాయిస్తోంది. ఇదిలా ఉండగా సింగరేణికి ప్రభుత్వాల నుంచి దాదాపు రూ. 20వేల కోట్లకుపైగానే బకాయిలు రావాల్సి ఉంది. 

అత్యున్నత స్థాయిలో నిలిపేలా ప్రణాళికలు 

దేశంలోని ప్రభుత్వ రంగ కంపెనీల్లో సింగరేణిని ఉన్నతస్థాయిలో నిలిపేలా ప్రణాళికలను రూపొందిస్తున్నాం. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  సహకరిస్తు న్నాయి. సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పూర్తి  సహాయ సహకారాలు అందిస్తున్నా రు. సింగరేణి  అభివృద్ధిలో భాగస్వాముల వుతున్నారు. ఈ ఏడాది టార్గెట్ 71 మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. కార్మికుల భద్రతకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం...  ఎన్​. బలరాం, సీఎండీ  సింగరేణి 

నైనీలో బొగ్గు తవ్వకాలకు సిద్ధం 

ఒడిశాలోని నైనీ కోల్​బ్లాక్​లో బొగ్గు తవ్వకాలకు సంస్థ చర్యలు తీసుకుంటోంది.  సంస్థ చరిత్రలోనే ఒక ఏరియా నుంచి ఏడాదికి పది మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తిని నైనీ కోల్​బ్లాక్​నుంచి వెలికితీసేందుకు సిద్ధమవుతోంది.  కొత్తగూడెం ఏరియాలోని వీకే –7 ఓపెన్ ​కాస్ట్ తో పాటు ఇల్లెందు ఏరియాలోని రొంపేడు(జేకే–5 ఎక్స్​టెన్షన్​) ఓసీలకు సెకండ్​ఫేజ్​పర్మిషన్స్​రావాల్సి ఉంది. 

 ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు పర్మిషన్స్​తెచ్చుకోవడంతో పాటు ఓవర్​బర్డెన్​ తీసేందుకు సంస్థ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఓవర్​ బర్డెన్​ కోసం టెండర్లను పిలిచింది. సెకండ్​ఫేజ్​పర్మిషన్స్​వచ్చేలోపు ఓబీ, బొగ్గు తవ్వకాలకు ఏర్పాట్లు చేసుకుంటోంది.  నైనీ కోల్​బ్లాక్​తో పాటు వీకే–7ఓసీ, రొంపేడ్​ ఓసీల ద్వారా ఏడాదికి దాదాపు17 మిలియన్​టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసేలా సంస్థ  ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.