కలెక్టర్‎పై దాడి కేసు: BRS మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్

కలెక్టర్‎పై దాడి కేసు: BRS మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్, అధికారులపై దాడి జరిగిన కేసులో బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ రెడ్డికి కొడంగల్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. 2024, నవంబర్ 27వ తేదీ వరకు పట్నం నరేంద్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్‎లో ఉండనున్నారు. న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిని భారీ బందోబస్తు నడుమ జైలుకు తరలిస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కొడంగల్ కోర్టు ప్రాంగణంతో పాటు.. జైలుకు తరలించే మార్గంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. 

కాగా, వికారాబాద్ జిల్లాలోని లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభ్రిప్రాయం తెలుసుకునేందుకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, రెవెన్యూ అధికారులపై దాడి జరిగింది. ఈ ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు, బీఆర్ఎస్ కార్యకర్త సురేష్‎ను ఏ1గా పోలీసులు చేర్చారు. పోలీసులు నిందితుడు సురేష్ కాల్ డేటా విశ్లేషించగా.. దాడి జరిగిన సమయంలో సురేష్, పట్నం నరేందర్ రెడ్డి పలుమార్లు ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

ALSO READ | కలెక్టర్పై దాడి చేయించింది బీఆర్ఎస్సే: డిప్యూటీ సీఎం భట్టి

ఈ క్రమంలోనే 2024, నవంబర్ 13వ తేదీ ఉదయం హైదరాబాద్ లో పట్నం నరేంద్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని పరిగి పోలీస్ స్టేషన్‎కు తరలించారు. ఈ ఘటనపై పట్నం నరేంద్ రెడ్డిని ప్రశ్నించిన పోలీసులు అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరు పర్చారు. కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ నరేందర్ రెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.