కలెక్టర్‎పై దాడి కేసు: సురేష్‎కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్, రెవెన్యూ సిబ్బందిపై దాడి కేసులో ప్రధాన నిందితుడు (A2) భోగమోని సురేష్‎కు కొడంగల్ న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.  నిందితుడు సురేష్‎కు 2024, డిసెంబర్ 4వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ 2024, నవంబర్ 19న కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసులు సురేష్‎ను సంగారెడ్డి జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరి కొందరిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. 

కాగా, వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఇతర రెవెన్యూ సిబ్బంది గ్రామానికి వెళ్లగా.. కలెక్టర్‎తో పాటు అధికారులపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. అధికారుల వాహనాలను సైతం రాళ్లతో ధ్వంసం చేశారు. కలెక్టర్, అధికారులపై దాడి జరగడం స్టేట్ పాలిటిక్స్‎లో సంచలనంగా మారింది. ఈ ఘటన వెనక బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందని.. స్థానికులను రెచ్చగొట్టి అధికారులపై దాడికి ఉసిగొల్పారని కాంగ్రెస్ ఆరోపించిన విషయం తెలిసిందే. 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తన అనుచరుడు భోగమోని సురేష్‎తో కలిసి అధికారులపై దాడికి ప్లాన్ చేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే వ్యూహం ప్రకారం కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులను సురేష్ తప్పుదోవ పట్టించి లగచర్ల గ్రామానికి తీసుకెళ్లి వారిపై దాడి చేయించాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో లగచర్ల దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డిని ఏ1 నిందితుడిగా పేర్కొన్న పోలీసులు.. ఈ కేసులో సురేష్‏ను  ఏ2 నిందితుడిగా చేర్చారు. 

ఈ ఘటన జరిగిన నాటి నుండి సురేష్ పరారీలో ఉండగా.. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడు సురేషే ఇవాళ నేరుగా వచ్చి పోలీసులు ముందు లొంగిపోవడం గమనార్హం. ఈ కేసులో కీలకంగా ఉన్న సురేష్ సరెండర్ కావడంతో.. లగచర్ల దాడి ఘటనలో నెక్ట్స్ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయనే దానిపై ఆసక్తి నెలకొంది. పోలీసులు ఆరోపిస్తున్నట్లుగా నిందితుడు సురేష్ బీఆర్ఎస్ పెద్దల పేర్లు చెబుతారా అని దానిపై ఉత్కంఠ నెలకొంది.