- చంచల్‌గూడ జైలుకు తరలింపు
- 700 మంది దగ్గర రూ.360 కోట్లు వసూలు చేసి మోసం
హైదరాబాద్, వెలుగు: సాహితీ ఇన్‌ఫ్రా వెంచర్స్ ఎండీ బూదటి లక్ష్మీనారాయణను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అధికారులు అరెస్టు చేశారు. సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో చంచల్‌గూడ జైలుకు14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కస్టడీకి అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని లక్ష్మీనారాయణ తరపు న్యాయవాదికి జడ్జి సూచించారు. లక్ష్మీనారాయణ అరెస్ట్ వివరాలను హైదరాబాద్ జోనల్ ఈడీ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
రూ.360 కోట్లు డైవర్ట్
సాహితీ ఇన్‌ఫ్రా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో లక్ష్మీనారాయణ సహా మరికొంత మంది ప్రచారం చేశారు. వల్డ్ క్లాస్ గేటెడ్ కమ్యూనిటీ పేరుతో ప్రీ లాంచ్ ఆఫర్ ఇచ్చారు. 700 మందికి పైగా కస్టమర్ల దగ్గర రూ.360 కోట్లు వసూలు చేశారు. అగ్రిమెంట్ ప్రకారం.. ప్లాట్స్, విల్లాస్ పూర్తి చేసి ఇస్తామన్నారు. లేకుంటే డబ్బు రీఫండ్ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే.. ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా కస్టమర్ల నుంచి సేకరించిన డబ్బును లక్ష్మీనారాయణతో పాటు ఆయన కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్స్‌కు దారిమళ్లించారు. దీంతో బాధితులు సిటీ సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు.
నకిలీ మెడికల్ సర్టిఫికెట్స్ చూపుతూ
రూ.360 కోట్లు మనీలాండరింగ్ జరిగినట్లు గుర్తించిన ఈడీ అధికారులు.. సీసీఎస్ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) రిజిస్టర్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా రూ.161.5 కోట్లు విలువ చేసే ఆస్తులు అటాచ్ చేశారు.బ్యాంక్ అకౌంట్స్, డిజిటల్ డాక్యుమెంట్స్‌ను సీజ్ చేశారు. ఈ క్రమంలోనే లక్ష్మీనారాయణను విచారించేందుకు సమన్లు జారీ చేశారు. కానీ, నకిలీ మెడికల్ సర్టిఫికెట్స్‌తో విచారణకు హాజరుకాలేదు. గత కొంతకాలంగా ఈడీ నుంచి తప్పించుకుతిరుగుతున్నారు. లక్ష్మీనారాయణ గురించి సమాచారం అందుకున్న ఈడీ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం ఉస్మానియా హాస్పిటల్‌లో మెడికల్ టెస్టులు జరిపించారు. అనంతరం నాంపల్లి క్రిమినల్ కోర్టు కాంప్లెక్స్‌లోని ఎమ్‌ఎస్‌జే కోర్టులో హాజరుపరిచారు.