
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ప్రారంభం కానున్నాయి. వీటిలో 13 పోలీస్ స్టేషన్లు హైదరాబాద్‌లో, ఒకటి వరంగల్ అర్బన్‌లో ఏర్పాటు చేయనున్నారు. 2020లో ప్రతిపాదనలు సమర్పించగా..కాంగ్రెస్ సర్కారు వచ్చాక ఆమోదముద్ర పడింది. ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి కొత్త పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించేలా చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ శాఖ అడిషనల్ కమిషనర్ అజయ్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ఇవే..
బంజారాహిల్స్, చిక్కడపల్లి, గండిపేట్, కొండా పూర్, పెద్ద అంబర్‌పేట్, కూకట్‌పల్లి, అమీన్‌పూర్, హసన్‌పర్తి, మారేడ్‌పల్లి, మీర్‌పేట్, కొంపల్లి, కాప్రా, నాచారం, అల్వాల్‌లలో కొత్తగా పోలీసు స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. వీటిలో బంజారాహిల్స్, చిక్కడపల్లి, గండిపేట్, కొండాపూర్, పెద్ద అంబర్‌పేట్, కూకట్‌పల్లి, అమీన్‌పూర్, హసన్‌పర్తి స్టేషన్లకు అద్దె భవనాలు కేటాయించారు. మారేడ్‌పల్లి, మీర్‌పేట్, కొంపల్లి, కాప్రా, నాచారం, అల్వాల్ కొత్త స్టేషన్లకు అద్దె భవనాలు దొరకకపోవడంతో.. వీటిని ప్రస్తుతం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లుగా నడుస్తున్న సికింద్రాబాద్, సరూర్‌నగర్, కుత్బుల్లాపూర్, ఘట్‌కేసర్, ఉప్పల్, మల్కాజ్‌గిరి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక గదుల్లో ఏర్పాటు కానున్నాయి.
కొత్త ఎక్సైజ్ స్టేషన్లకు ఇన్‌చార్జులుగా పాత స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలను నియమించారు. కొత్తగా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు ఇన్‌చార్జి ఎస్‌హెచ్‌వోలుగా పటేల్ బానోత్, జగన్మోహన్ రెడ్డి, డి.రామకృష్ణ, జి.దేవేందార్రావు, బి.లక్ష్మణ్ గౌడ్, ఎన్.శ్రీనివాస రెడ్డి, జె.ధన్వంత్ రెడ్డి, టి.యాదాయ్య, డి.వేణు కుమార్, జె.రవి, బి.ఓంకార్, జి.చంద్రశేఖర్, కె.పరమేశ్వర్ గౌడ్, జి దుర్గాభవాని ఇన్‌చార్జులుగా కొనసాగనున్నారు. ప్రతి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు ఇద్దరు కానిస్టేబుళ్లను కేటాయించారు.