రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రజారోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం...బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ తో పాటు..జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే బస్తీ దవాఖానాలు ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 350 బస్తీ దవాఖానలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్క హైదరాబాద్ జిల్లా పరిధిలోనే 153 బస్తీ దవాఖానాలు పని చేస్తుండగా... నూతనంగా మరో 14 బస్తీ దవాఖానాలు ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించింది.
హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలో మే 16వ తేదీ మంగళవారం రెండు బస్తీ దవాఖానలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. గన్‌ఫౌండ్రి డివిజన్ పరిధిలోని నేతాజీనగర్ కమ్యూనిటీలో.. జాంబాగ్ డివిజన్ పరిధిలోని సుబాన్‌పురా కమ్యూనిటీహాళ్లలో బస్తీ దవాఖానాలను ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జంటనగరాల్లో బస్తీ దవాఖానాలు ప్రారంభించిన తర్వాత గాంధీ, ఉస్మానియా వంటి ప్రధాన ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య తగ్గిందన్నారు. బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని అన్నారు. స్థానికత ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు కూడా ఉచితంగానే అందజేస్తున్నారని..ఈ అవకాశాన్ని నగర ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.