ఇండియాలో కరోనా కేసులు74: కొత్తగా 14 మంది 

ఇండియాలో కరోనా కేసులు74:  కొత్తగా 14 మంది 

    రాష్ట్రాల వారీగా కేసుల సంఖ్యను ప్రకటించిన కేంద్రం

    ఎపిడెమిక్​ డిసీజ్​ చట్టం ప్రయోగించాల్సిందిగా రాష్ట్రాలకు సూచన

దేశంలో కొవిడ్​ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా 73 మంది కొవిడ్​ బారిన పడినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా 13 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. అందులో 9 కేసులు మహారాష్ట్రలోనే రిపోర్ట్​ అయ్యాయని, ఢిల్లీ, లడఖ్​, యూపీలో ఒక్కొక్కరికి, మరో విదేశీయుడికి పాజిటివ్​గా తేలిందని తెలిపింది. మొత్తం నమోదైన కేసుల్లో విదేశీయులు 17 మంది ఉన్నట్టు పేర్కొంది. రాష్ట్రాల వారీగా నమోదైన కొవిడ్​ కేసుల వివరాలను ప్రకటించింది. కొవిడ్​ ప్రభావిత దేశాల్లోని ఇండియన్లు తిరిగి రావాలంటే అక్కడి అధికారుల నుంచి కరోనా నెగెటివ్​ సర్టిఫికెట్​ తీసుకురావాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కేరళ ప్రభుత్వం వ్యతిరేకించింది. దానిపై అసెంబ్లీలో తీర్మానం చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్​ కేసులు పెరిగిపోతుండడంతో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎపిడెమిక్​ డిసీజెస్​ యాక్ట్​ 1897లోని సెక్షన్​ 2ను ప్రయోగించాల్సిందిగా ఆరోగ్య శాఖ సూచించింది. కొవిడ్​పై పోరాడేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ యాక్ట్​ 2005ని ప్రయోగించింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి చైర్మన్​గా నేషనల్​ ఎగ్జిక్యూటివ్​ కమిటీ (ఎన్​ఈసీ)ని ఏర్పాటు చేసింది. కొవిడ్​పై అధికారులు, సిబ్బందికి ఢిల్లీ ట్రాఫిక్​ పోలీస్​ డిపార్ట్​మెంట్​అవగాహన కల్పిస్తోంది. అంతేగాకుండా వాహనదారులకూ సలహాలు, సూచనలిస్తోంది. బ్రీత్​ అనలైజింగ్​ టెస్టులు చేసేటప్పుడు అందరికీ వేర్వేరు స్ట్రాలు వినియోగించాల్సిందిగా సూచించింది.

మేమెక్కడికి పోవాలి?

ఇటలీ ఎయిర్​పోర్టుల్లో చిక్కుకుపోయిన ఇండియన్ల పరిస్థితి గందరగోళంగా తయారైంది. రోమ్​, మిలాన్​ ఎయిర్​పోర్టుల్లో దాదాపు 300 మంది ఇండియన్లు లాక్​ అయిపోయారు. అందులో గర్భిణులు, పిల్లలూ ఉన్నారు. ఎయిర్​పోర్టులో చిక్కుకున్న కేరళ మహిళ ఒకరు సోషల్​ మీడియాలో వీడియో పోస్ట్​ చేశారు. ఉన్న పళంగా అన్నింటినీ బంద్​చేస్తే తామెక్కడికి పోవాలని ప్రశ్నించారు. వెంటనే తమను ఇండియాకు తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎమిరేట్స్​ ఎయిర్​లైన్స్​, ఇటలీ అధికారులు, ఇండియన్​ అధికారులే కరోనా నెగెటివ్​ సర్టిఫికెట్​ కావాలని పట్టుబడుతున్నారంటూ వాపోతున్నారు. ‘‘డియర్​ ఫ్రెండ్స్​. మేమంతా ఇండియాకు వచ్చేందుకు టికెట్లు బుక్​ చేసుకున్నాం. విమానం ఎక్కేందుకు ఇటలీ అధికారులు ఒప్పుకోవట్లేదు. సర్టిఫికెట్​ కోసం పట్టుబడుతున్నారు. ఇండియన్​ గవర్నమెంట్​ నుంచి అనుమతి లేదని చెబుతున్నారు. చిన్న పిల్లలు, గర్భిణులూ ఇక్కడ చిక్కుకుపోయారు. మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లకపోతే మేమంతా ఎక్కడికి పోవాలి?’’ అని ఆమె ఆ వీడియోలో ప్రశ్నించారు. గడ్డకట్టకుపోయే చలిలో ఎయిర్​పోర్టులోని ఓ మూలన బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామన్నారు.

ఇరాన్​లోని స్టూడెంట్లతో మాట్లాడండి

ఇరాన్​లో చిక్కుకుపోయిన ఇండియన్​ స్టూడెంట్లతో వెంటనే మాట్లాడాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. స్టూడెంట్లతో అక్కడి ఇండియన్​ ఎంబసీ అధికారులు టచ్​లో ఉండేలా చూడాలని సూచించింది. దీనిపై ఈ నెల 17న రిపోర్ట్​ సబ్​మిట్​ చేయాల్సిందిగా ఆదేశించింది. ఇరాన్​లో చిక్కుకున్న ఇండియన్​ స్టూడెంట్ల తల్లిదండ్రులు వేసిన పిటిషన్​ను విచారించిన హైకోర్టు, ఈ ఆదేశాలిచ్చింది.

వాఘాలో రిట్రీట్​ బంద్​

కరోనా వైరస్​ నేపథ్యంలో అటారీ–వాఘా సరిహద్దుల్లో నిర్వహించే బీటింగ్​ రిట్రీట్​ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో అక్కడకు వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా పడిపోయింది. దాని ప్రభావం అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిపై పడింది. రోజూ అక్కడికి 50 వేల మంది దాకా బీటింగ్​ రిట్రీట్​ను చూసేందుకు వెళ్తుంటారు. ఆ టూరిస్టులతోనే హోటళ్లు, షాపుల వాళ్ల బతుకు బండి నడిచేది. కానీ, ఇప్పుడు బీటింగ్​ రిట్రీట్​ను రద్దు చేసేయడంతో తామెట్లా బతకాలని చిరు వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ట్యాక్సీ డ్రైవర్లపైనా ఆ ప్రభావం పడింది.

ఇటలీ మొత్తం బంద్​

కేసులు, మరణాలు పెరుగుతుండడంతో ఇటలీ మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటిదాకా ట్రావెల్​ బ్యాన్​ విధించిన సర్కార్​, ఇప్పుడు మెడికల్​ షాపులు తప్ప బార్లు, స్టోర్లు, సూపర్​మార్కెట్లన్నింటినీ రెండు వారాల పాటు బంద్​ పెట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ‘‘దేశం కోసం త్యాగం చేస్తున్న జనాలందరికీ థ్యాంక్స్​. మనం ఓ గొప్ప దేశంగా నిరూపించుకుంటున్నాం. దానిని మరింత గట్టిగా ప్రూవ్​ చేయాలి. ఇకపై అత్యవసరాలైన ఫుడ్​స్టోర్లు, మెడికల్​ షాపులు తప్ప ఏవీ ఓపెన్​ ఉండవు. బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు, హెయిర్​డ్రెస్​ సెలూన్లు, క్యాంటీన్ల వంటివి అన్నింటినీ బంద్​ పెట్టాల్సిందే. అలాగని ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదు. కావాల్సిన వస్తువులను హోం డెలివరీ చేస్తారు’’ అని దేశ ప్రధాని గ్వెసెప్​ కాంటీ ప్రకటించారు. కొవిడ్​తో పోరాడేందుకు సుమారు రూ.2.08 లక్షల కోట్లను (2,800 కోట్ల డాలర్లు) ఫండ్​ను విడుదల చేసింది. ఇటలీలో ఒక్క రోజులోనే కొవిడ్​ మరణాలు 31 శాతం పెరిగాయి. చనిపోయిన వారి సంఖ్య 827కి చేరింది. దేశంలోని 17 స్టోర్లను మూసేస్తున్నామని యాపిల్​ ప్రకటించింది. ఆస్ట్రేలియా రూ.85 వేల కోట్లు విడుదల చేసింది.

పోరాటం పెంచాల్సిందే

కొవిడ్​ మరింత విస్తరించకుండా ప్రపంచ దేశాలు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్​ ఆంటోనియో గుటెరెస్​ పిలుపునిచ్చారు. ప్యాండెమిక్​గా ప్రకటించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ, ప్రతి దేశమూ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పటిష్టమైన చర్యలు తీసుకుంటే కరోనా మహమ్మారిని పారదోలొచ్చని స్పష్టం చేశారు. ట్రీట్​మెంట్​ తీసుకునే స్తోమత లేనివాళ్లకు, వైరస్​ ప్రభావం ఎక్కువగా ఉండే వృద్ధులకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఎవరెస్ట్​ శిఖరాన్ని ఎక్కేందుకు అనుమతులను చైనా సర్కార్​ రద్దు చుఏసింది.

4,749 మంది బలి

కొవిడ్​కు ప్రపంచవ్యాప్తంగా 4,476 మంది బలయ్యారు. 1,29,641 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 125 దేశాలకు వైరస్​ పాకింది. చైనాలో 80,796 కేసులు నమోదవగా, 3,169 మంది చనిపోయారు. ఇటలీలో 12,462 కేసులు నమోదయ్యాయి. ఇరాన్​లో 10,075 కేసులకుగానూ 429 మంది చనిపోయారు. సౌత్​ కొరియాలో 7,869 కేసులు, 66 మరణాలు రికార్డయ్యాయి. స్పెయిన్​లో 84, ఫ్రాన్స్​లో 48, అమెరికాలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో కేసుల సంఖ్య 1,364కి పెరిగింది.