రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇవాళ (బుధవారం) ఒక్క రోజే కొత్తగా 14 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని తెలంగాణ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్లు ఇద్దరు మాత్రమే ఉండగా, నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్లు 12 మంది ఉన్నారు. కొత్త కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరింది. కాగా, ఇంకా మరో నలుగురి జీనోమ్ సీక్వెన్సింగ్ శాంపిల్స్ రిపోర్టులు రావాల్సి ఉంది. మరో వైపు సిరిసిల్ల జిల్లాలో ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి తల్లి, భార్యకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారి శాంపిల్స్ కూడా జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు వైద్య అధికారులు.
మరోవైపు గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 182 అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. అలాగే కరోనాతో బాధపడుతూ ఒకరు మరణించారని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,72,447కు చేరగా.. మృతుల సంఖ్య 4017కు చేరినట్లు తెలిపింది.