4 రోజుల్లో 14 మంది మృతి
శుక్రవారం మరో ముగ్గురు బలి
62 కొత్త కేసులు.. అందులో వలస కూలీలు 19 మంది
హైదరాబాద్‌లోనే 42 మందికి
1,761కి చేరిన కరోనా కేసులు
డిటెక్టివ్ ఇన్స్పెక్టర్కు పాజిటివ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 4 రోజుల్లోనే 14 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. గురువారం ఐదుగురు, శుక్రవారం ముగ్గురు చనిపోయినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే మరణించిన వారి వివరాలను మాత్రం వెల్లడించలేదు. దీంతో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 48కి పెరిగింది. శుక్రవారం 62 కొత్త కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోనే 42 కేసులు రికార్డయ్యాయి. రంగారెడ్డిలో ఒక కేసు నమోదైంది. వేరే రాష్ర్టాల నుంచి తిరిగొచ్చిన, వివిధ జిల్లాలకు చెందిన 19 మంది వలస కూలీలకు పాజిటివ్ వచ్చింది. దీంతో కరోనా బారిన పడిన వలస కార్మికుల సంఖ్య 116కు చేరింది. వీటితో కలిపి రాష్ర్టంలో మొత్తం కేసుల సంఖ్య 1,761కి పెరిగింది. ఇందులో 1,043 మంది డిశ్చార్జ్ అవగా, 670 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
డిటెక్టివ్ ఇన్స్పెక్టర్కు కరోనా
బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఓ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్కు కరోనా సోకింది. కొన్నిరోజులుగా అతడు షాహీన్‌నగర్‌లో డ్యూటీ చేస్తున్నాడు. వారం రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నాడు. ఫీవర్ హాస్పిటల్లో టెస్టులు చేయడంతో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడితో కలిసి పని చేసిన పోలీసులను క్వారంటైన్‌కు తరలించారు. గల్ఫ్ దేశాల నుంచి వచ్చి హోటల్ క్వారంటైన్లో ఉన్న నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే జిల్లాలో మహారాష్ర్ట నుంచి తిరిగొచ్చిన మరో ఇద్దరికి వైరస్ ఉన్నట్టు తేలింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురువారం ఒకరికి వైరస్ పాజిటివ్ వచ్చింది. అతడు ఈ నెల 14న ముంబై నుంచి వచ్చినట్టు అధికారులు ప్రకటించారు. జగిత్యాల జిల్లాలో శుక్రవారం ముంబై నుంచి వచ్చిన 9 మందికి కరోనా వచ్చినట్టు తేలింది.
For More News..