వెలుగు, నెట్వర్క్: భారీ వర్షాల కారణంగా గురువారం వరదల్లో కొట్టుకుపోయి, ఇండ్లు కూలి, విద్యుత్ వైర్లు తెగిపడి రాష్ట్రవ్యాప్తంగా 14 మంది చనిపోయారు. దాదాపు 20 మంది వరకు గల్లంతయ్యారు. అత్యధికంగా భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 18 మంది కనిపించకుండా పోయారు. వారి కోసం పోలీసులు, ఆఫీసర్లు గాలిస్తున్నారు.
వరదలో కొట్టుకుపోయిన అన్నదమ్ములు
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామ శివారులో వరద నీటిలో కొట్టుకపోయి గ్రామానికి చెందిన అన్నదమ్ములు చనిపోయారు. పిండి యాకయ్య (40), పిండి శ్రీను (35) కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరిద్దరూ సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో తమ బంధువు చనిపోతే దశదినకర్మకు వెళ్లారు. జగద్గిరిగుట్ట నుంచి- తొర్రూరు వెళ్తున్న బస్సు ఎక్కి వస్తుండగా మార్గమధ్యంలో గంట్లకుంట-–పోచంపల్లి రోడ్డు తెగిపోయింది. దీంతో డ్రైవర్ బస్సును వెనక్కి తిప్పారు. బస్సు దిగిన యాకయ్య, శ్రీను రోడ్డు దాటే ప్రయత్నం చేశారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఇద్దరూ కొట్టుకపోయి చనిపోయారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కన్నారానికి చెందిన పొన్నాల మహేందర్(32) సమీపంలోని తరిగొప్పులకు బైక్ పై వెళ్తుండగా, కన్నారంవాగులో కొట్టుకుపోయాడు. వరద తాకిడికి బైక్ వంతెన కింద పడడంతో నీళ్లలో కొట్టుకుపోయాడు. ఆయన డెడ్ బాడీ హనుమకొండ జిల్లా వేలేరు సమీపంలో తేలింది.
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని కౌల్పూర్గ్రామానికి చెందిన పోచమ్మల చిన్న ఎల్లప్ప (35) గురువారం శాపూర్శివారులోని కుద్వాన్పూర్చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి వరదలో కొట్టుకుపోయాడు. అతడితో పాటు వెళ్లిన మిగతా నలుగురు ఎల్లప్పను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు.
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం శివపల్లి గ్రామానికి చెందిన రైతు మండిగా చిన్ను(59) బుధవారం మధ్యహ్నం గూడెం-శివపల్లి మధ్యలో వాగు దాటుతూ కొట్టుకుపోయాడు. గురువారం మధ్యాహ్నం చెట్ల పొదల మధ్య చిన్ను డెడ్‌బాడీ దొరికింది.
కల్వర్టులో పడి ఒకరు.. చెట్టు కూలి ఇంకొకరు.. గూడ కూలి మరొకరు
భూపాలపల్లి మున్సిపాలిటీ 9వ వార్డు పరిధిలోని పిల్లోనిపల్లికి చెందిన రైతు పి.సంతోశ్ ప్రమాదవశాత్తు మున్సిపాలిటీ కల్వర్టులో పడి చనిపోయాడు. గురువారం ఉదయం వరద నీటిలో కల్వర్టును అంచనా వేయకుండా కాలువేయడంతో ఇటువైపు మునిగి అటువైపు శవమై తేలాడు. ఇదే జిల్లా రేగొండలో భారీ వర్షానికి ఇంటిపై చెట్టు కూలి మద్ది వెంకట స్వామి(45) చనిపోయాడు. హన్మకొండలో ఉండే ఇతను బుధవారమే అనారోగ్యంతో ఇంటికొచ్చాడు. ఒంటరిగా గుడిసెలో పడుకోగా తెల్లవారుజామున ప్రమాదవశాత్తు చెట్టుకూలి మరణించాడు.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని జవహర్ రోడ్డుకు చెందిన బొచ్చుకారి విజేత (29) బాత్ రూం గోడ కూలి మీదపడి చనిపోయింది. స్నానం చేయడానికి బాత్ రూమ్ కు వెళ్లగా అప్పటికే వానలకు నాని ఉన్న గోడ కూలి విజేత పై పడింది. ఆమెకు తీవ్ర గాయాలుకాగా, కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.
ALSO READ:రేపు ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు
హనుమకొండలో కరెంట్ తీగ పడి..
వానలు, వరదలకు హనుమకొండ జిల్లాలో ఇద్ద రు చనిపోగా.. మరొకరు గల్లం తయ్యారు. హనుమకొండ అమృత థియేటర్ సమీ పంలో ఉండే ఊట్ల విద్యాసాగర్ (37) ఉదయం పాల ప్యాకెట్ కోసం బయటకు వెళ్లాడు. అమృత థియేటర్ వద్ద విద్యుత్తు హై టెన్షన్ వైర్లు తెగి మీద పడటంతో విద్యాసాగర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వేలేరు మండలానికి చెందిన మహేందర్(37) గురువారం వ్యవసాయ పని కోసం బావి వద్దకు వెళ్తూ చెరువు నుంచి వచ్చే వరద నీటిలో బైక్ తో పడిపోయాడు. స్థానికులు గాలించినా ఫలితం లేకపోగా.. కొద్దిసేపటికి కొంతదూరంలో చెట్ల మధ్య శవమై కనిపించాడు. హనుమకొండ జిల్లా గోపాలపూర్ కు చెందిన రవి(40) స్థానిక చెరువులో గల్లంతయ్యాడు.
రంగారెడ్డి జిల్లా దోమ మండలం ఐనాపూర్‌లో బుల్సని బాలరాజ్ (46) ఇంటి పైనుంచి విద్యుత్ వైర్లు వెళ్లాయి. విద్యుత్ వైర్లపై చెట్టు విరిగి పడింది. చెట్టుకొమ్మను తీస్తుండగా కరెంట్ షాక్ తగిలి బాలరాజ్ మృతి చెందాడు. ఇంటిపై ఉన్న వైర్లను తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని బాలరాజ్ కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు.