- తల్లిని చంపిన కేసులో విచారిస్తే మరో మహిళ హత్య వెలుగులోకి
- పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు
- జల్సాలకు అలవాటు పడి వరుసగా హత్యలు
కోటగిరి, వెలుగు: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం జల్లపల్లి ఫారం గ్రామంలో తల్లిని చెరువులో ముంచి చంపిన ఘటనలో నిందితుడిని పోలీసులు విచారించగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. రుద్రూర్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా పూర్తి వివరాలను పోలీసులు బుధవారం మీడియాకు తెలిపారు. జల్లపల్లి ఫారం గ్రామానికి చెందిన నేనావత్ రాములు మూడు నెలల క్రితం కోటగిరి మండలం నాగేంద్రపూర్ గ్రామానికి చెందిన గైని మాదమ్మ అనే మహిళను బస్వాపూర్ కల్లు బట్టీలో చూశాడు.
ఆమె ఒంటిపై ఉన్న నగలను అపహరించాలని ప్లాన్ వేశాడు. మాటామాటా కలిపి బీర్కూర్ మండలం బరంగేడ్గి గ్రామ శివారులోకి ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ ఆమె నగలు లాక్కునేందుకు ప్రయత్నించాడు. సహకరించకపోవటంతో మాదమ్మను ఓ కాలువలో ముంచి చంపాడు. అనంతరం మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు, వెండి నగలతో పరారయ్యాడు. తన తల్లి మంగ్లీని కూడా డబ్బులు, నగలు ఇవ్వాలని వేధించాడు. ఆదివారం తన తల్లిని స్థానిక నీటి కుంట వద్దకు తీసుకెళ్లి కుంటలో ముంచి చంపేశాడు.
డెడ్ బాడీ ఎవరికీ కనిపించకుండా మృతదేహంపై బండరాయి కట్టి నీటిలో పడేశాడు. మూడు రోజుల తర్వాత శవం నీటి నుంచి పైకి తేలడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రాములును అదుపులోకి తీసుకుని విచారించగా తన తల్లితో పాటు మూడు నెలల క్రితం మరో మహిళను హతమార్చినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. తల్లి మంగ్లీ నగలుతో పాటు గైని మాదవ్వకు చెందిన నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. విచారణలో కోటిగిరి ఎస్సై సందీప్, పోలీసు
సిబ్బంది ఉన్నారు.