చేస్తున్న ఉద్యోగం పోతే.. కొత్త ఉద్యోగం వెతుక్కోవడం ఎంత కష్టమో ఈ కథనం చదివితే అర్థమవుతుంది. ముంబైకి చెందిన ఓ గ్రాఫిక్ డిజైనర్ 14 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్నా.. కొత్త ఉద్యోగం దొరకబెట్టుకోలేకపోయాడు. అలా అని అతను జాబ్ కోసం పడని పాట్లు లేవు. రెజ్యూమ్ పంపని కంపెనీలు లేవు. పదుల సంఖ్యలో రెజ్యూమ్‌లు పంపాడు. తెలిసిన స్నేహితుడినల్లా ఉద్యోగం ఉంటే చెప్పమని వేడుకున్నాడు. అయినప్పటికీ, సఫలం కాలేకపోయాడు. చివరకు చేసేదీమీ లేక ఆటో కొనుక్కొని యజమాని అవతారమెత్తాడు.
స్వయంగా అతనే ఈ కథను నెట్టింట పంచుకున్నాడు. తనకు ఎదురైన ప్రతి ఒక్క అనుభవాన్ని నెటిజెన్లకు తెలియజేశాడు. 14 ఏళ్ల అనుభవం ఉన్నప్పటికీ, తానెందుకు మరో ఉద్యోగం సంపాదించుకోలేకపోయాననే బాధ అతని పోస్టులో స్పష్టంగా తెలుస్తోంది. చివరకు ఇలా కష్టాలు పడే బదులు ఆటో కొనుక్కొని డ్రైవర్‌గా మారడం ఉత్తమమని అతని చూపించిన తెగువ.. ఉద్యోగాలు దొరక్క చింతిస్తున్న పాఠకుల్లోనూ ధైర్యాన్ని నింపుతోంది.
పేరు.. కమలేష్ కమ్‌టేకర్. గ్రాఫిక్ డిజైనర్‌గా 14 ఏళ్ల అనుభవం. కాస్ట్ కటింగ్‌లో భాగంగా కొన్ని నెలల క్రితం ఉద్యోగం నుండి తొలగించబడ్డాడు. అది పోగానే కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. ఎక్కడ ఉద్యోగం దొరకలేదు. ఐదు నెలల పాటు కంపెనీల చుట్టూ తిరిగాడు. 'రెజ్యూమ్‌లు ఇచ్చిపో ఖాళీలు ఉన్నపుడు ఫోన్ చేస్తాం..' అన్న వారే తప్ప ఉద్యోగమిచ్చిన వారు లేరు. తోటి స్నేహితులను అడిగాడు. వారి రిఫరెన్స్‌లతోనూ ఇంటర్వ్యూలకు వెళ్ళాడు. కానీ, అక్కడా సఫలం కాలేకపోయాడు. జీతం ఎక్కువన్నట్లు అనేక సంస్థలు అతన్ని తిరస్కరించాయి. వీటన్నింటితో విసిగిపోయిన అతడు స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుని.. ఆటో కొనుక్కొని డ్రైవర్ అవతారమెత్తాడు. ఈ కథనంతా లింక్డ్ ఇన్ వేదికగా పంచుకున్నాడు.
చూశారుగా..! ఉద్యోగం ఏముంది పోతే ఇంకొకటి దొరకడం ఎంత కష్టమో.. అటువంటి ఆలోచనలు చేసే వారు ఉంటే కాస్త ఆలోచించండి. మీ దగ్గర ఎంత అనుభవం ఉన్నా.. వారికి అవసరం లేకుంటే.. మీకు ఉద్యోగాలు దొరకడం కష్టం. అలాగే, ఉద్యోగం రాలేదని చింతించకుండా సొంతకాళ్లపై నిలబడే ప్రయత్నం చేయండి.