రాజ్‌నంద్‌గావ్: ఫోన్ లో అబ్బాయిలతో ఎక్కువగా మాట్లాడొద్దని మందలించినందుకు ఓ14 ఏళ్ల బాలిక తన అన్ననే గొడ్డలితో నరికి హత్య చేసింది. ఈ దారుణ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాఘర్-చుయిఖదాన్-గండై (కెసిజి) జిల్లాలో చుయిఖదాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్లిదిహ్కల గ్రామంలో మే 4వ తేదీ శనివారం జరిగింది.
మొబైల్ ఫోన్‌లో అబ్బాయిలతో ఎక్కువగా మాట్లాడుతున్నావని.. ఇకనుంచి ఫోన్ ఎక్కువగా చూడొద్దని.. అబ్బాయిలతో మాట్లాడటం మానుకోవాలని 18ఏళ్ల యువకుడు తన చెల్లిని మందలించాడు. దీంతో బాధపడిన సదరు బాలిక.. కోపంతో నిద్రి పోతున్న సమయంలో సోదరుడి గొంతుపై గొడ్డలితో దారుణంగా దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తరువాత, ఆమె స్నానం చేసి, తన బట్టలపై రక్తపు మరకలను శుభ్రం చేసి, తన సోదరుడి హత్య గురించి పొరుగువారికి తెలియజేసింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక దర్యాప్తులో తన సోదరుడిని తానే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో బాలిక అంగీకరించింది. ఘటన జరిగినప్పుడు తాను, తన సోదరుడు మాత్రమే ఇంట్లో ఉన్నామని, ఇతర కుటుంబ సభ్యులు పని నిమిత్తం వెళ్లారని బాలిక పోలీసులకు తెలిపింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.