
నైరోబి: కెన్యాలో సింహం దాడి చేయడంతో14 ఏండ్ల బాలిక మరణించింది. దేశ రాజధాని నైరోబి శివార్లలో ఈ ఘటన జరిగింది. నైరోబి నేషనల్ పార్కు నుంచి సింహం తప్పించుకుని నివాస సముదాయాల్లోకి రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక తన స్నేహితురాలితో కలిసి ఉన్నప్పుడు ఆమెను సింహం లాక్కెళ్లిందని కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ (కేడబ్ల్యూఎస్) అధికారులు తెలిపారు.
ఆమె స్నేహితురాలు అప్రమత్తం చేయడంతో తాము వెంటనే అక్కడికి చేరుకున్నామని చెప్పారు. మ్బగతి నది సమీపంలో బాలిక డెడ్ బాడీని కనుగొన్నామని పేర్కొన్నారు. సింహం కోసం గాలిస్తున్నామని, ఉచ్చులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇటువంటి ఘటనలు మరిన్ని చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టినట్టు తెలిపారు.