తండ్రి అనారోగ్యంతో ఉన్నాడు.. కదలలేడు.. మంచంపై ఉన్నాడు.. ఎలాగైనా తండ్రిని కాపాడుకోవటానికి ఆస్పత్రికి తీసుకెళ్లాలి.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. అయినా ఆ 14 బాలిక దిక్కులు చూడలేదు.. తండ్రిని కాపాడుకోవటానికి వెంటనే సిద్ధం అయిపోయింది. తన తండ్రిని రిక్షాలో కూర్చోబెట్టింది.. తానే స్వయంగా రిక్షా తొక్కుతూ 35 కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. భారతదేశం అభివృద్ధి చెందుతోంది అనే వాళ్లకు.. ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. పేద కుటుంబం ఆస్పత్రికి వెళ్లాలంటేనే ఎంత నరకంగా మారిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒడిశా రాష్ట్రంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ పూర్తి వివరాల్లోకి వెళితే..
ఒడిశాలోని భద్రక్‌లోని జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రికి గాయపడిన తన తండ్రిని తీసుకెళ్లడానికి 14 ఏళ్ల ఓ బాలిక 35 కిలోమీటర్లు ట్రాలీ రిక్షా తొక్కింది. ఈ సంఘటన అక్టోబర్ 23న జరిగింది. అయితే ట్రాలీలో తన తండ్రిని ఇంటికి తీసుకెళ్తుండగా భద్రక్ పట్టణంలోని మోహతాబ్ చక్ సమీపంలో కొంతమంది స్థానిక ప్రజలు, జర్నలిస్టులు బాలికను గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
నడిగన్ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక సుజాత సేథి ట్రాలీని తొక్కుతూ తన గ్రామానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధామ్‌నగర్ ఆసుపత్రికి గాయపడిన తన తండ్రిని తీసుకెళ్లింది. అయితే, వైద్యులు ఆమె తండ్రిని భద్రక్ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రికి తరలించాలని కోరారు. అక్టోబర్ 23న తన తండ్రిని జిల్లా ఆసుపత్రికి తీసుకురావడానికి ఆమె ట్రాలీని 35 కి.మీ.లు తొక్కింది. అక్టోబర్ 22న జరిగిన ఓ గ్రూపు ఘర్షణలో ఆమె తండ్రి శంభునాథ్ గాయపడ్డట్టు సమాచారం.
సుజాత చెప్పిన వివరాల ప్రకారం, భద్రక్ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రి వైద్యులు ఆమెను తిరిగి వెళ్లి ఆపరేషన్ కోసం ఒక వారం తర్వాత రావాలని సూచించారు. "నా వద్ద ప్రైవేట్ వాహనాన్ని అద్దెకు తీసుకోవడానికి డబ్బు లేదు. అంబులెన్స్‌కు కాల్ చేయడానికి మొబైల్ ఫోన్ కూడా లేదు. కావున నేను అతన్ని (శంభునాథ్) ఆసుపత్రికి తీసుకురావడానికి మా నాన్న ట్రాలీని ఉపయోగించాను" అని ఆమె చెప్పింది.
ఘటన గురించి సమాచారం అందుకున్న భద్రక్ ఎమ్మెల్యే సంజీబ్ మల్లిక్, ధామ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర దాస్ బాలిక వద్దకు చేరుకుని అవసరమైన సహాయం అందించారు. భద్రక్ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ (CDMO) శాంతాను పాత్ర మాట్లాడుతూ.. రోగి అక్టోబర్ 23న చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాడు. వారం తర్వాత అతనికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. "రోగులను ఇంటికి తీసుకువెళ్లడానికి అంబులెన్స్ సర్వీస్ లాంటి సదుపాయం మాకు లేదు... అతను చికిత్స ముగిసే వరకు ఆసుపత్రిలోనే ఉంటాడు" అని అతను చెప్పాడు.