
ఒక్కరోజులో ఆరు వరల్డ్ రికార్డులు బద్దలు కొడితే ఎలా ఉంటుంది? అది కూడా పద్నాలుగేండ్ల బాలుడు. ఊహిస్తేనే.. ఆశ్చర్యంగా ఉంది కదూ. దాన్ని నిజం చేసి చూపించాడు ఆర్యన్. అందుకుగానూ హ్యూమన్ క్యాలుక్యులేటర్ అనిపించుకుంటున్నాడు. ఎవరీ ఆర్యన్.. ఏంటా కథ?
మహారాష్ట్రకు చెందిన ఆర్యన్ శుక్లా వయసు పద్నాలుగేండ్లు. ఈ వయసులో ఎవరైనా ఏం చేస్తారు? అల్లరి, ఆటలు, పాటలు... అంటూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ, కొందరు వాటితోపాటు తమ టాలెంట్‌ని కూడా ప్రదర్శిస్తుంటారు. అయితే, ఆర్యన్ టాలెంట్ చూసి ప్రపంచమే అబ్బురపడింది. ఎందుకంటారా... 50 అంకెల సంఖ్యలను అత్యంత వేగంగా జోడించి టాస్క్ పూర్తిచేశాడు. అందుకుగాను గతేడాది ఆర్యన్ మొదటిసారి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొల్లగొట్టాడు. దుబాయ్‌లో జరిగిన గిన్నిస్ రికార్డ్స్ పోటీలో శుక్లా 25.19 సెకండ్ల వ్యవధిలో ఈ ఫీట్‌ను సాధించాడు. దీంతో మొత్తం ఆరు గిన్నిస్ రికార్డులు ఆర్యన్ పేరు మీద నమోదయ్యాయి.
శుక్లా 100 నాలుగంకెల సంఖ్యలను కలపడానికి 30.9 సెకండ్లలో పూర్తి చేశాడు. 200 నాలుగంకెల సంఖ్యలను కలపడానికి1నిమిషం, 9.68 సెకండ్లు పట్టింది. 50 ఐదు అంకెల సంఖ్యలను కలపడానికి 18.71 సెకండ్లు, 20 అంకెల సంఖ్యను పదంకెల సంఖ్యతో భాగించడానికి 5 నిమిషాల 42 సెకండ్లు పట్టింది. రెండు ఐదంకెల సంఖ్యలను గుణించడానికి 51.69 సెకండ్లు, రెండు ఎనిమిది అంకెల సంఖ్యలను గుణించడానికి 2 నిమిషాల 35.41 సెకండ్ల టైం తీసుకున్నాడు.
ఇలా గణితానికి సంబంధించిన ఆరు టాస్క్‌లను ఒకే రోజు పూర్తి చేశాడు. దీంతో ఆరు రికార్డులు సొంతం చేసుకున్నాడు ఆర్యన్. అత్యంత వేగంగా లెక్కించడం ఆర్యన్ ప్రత్యేకత కాబట్టి తనని ముద్దుగా హ్యూమన్ క్యాలుక్యులేటర్ అని పిలుస్తున్నారు. అయితే తన కొడుక్కి ఈ టాలెంట్ ఎలా వచ్చిందోనని శుక్లా తండ్రి కూడా ఆశ్చర్యపోతున్నాడు.