ఈ మధ్యకాలంలో కొందరు మగాళ్లు మృగాళ్లుగా ప్రవర్తిస్తూ అభశుభం తెలియని చిన్నారుల జీవితాలను ఆదిలోనే చిదిమేస్తున్నారు. ఇటీవలే కోల్కతాలో జరిగిన అత్యాచార మరియు హత్య సంఘటన మరువకముందే ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది.. తిరుపతిలోని ఓ జువైనల్ హోంలో 14ఏళ్ళ బాలికపై అత్యాచార ఘటన కలకలం రేపింది.
పూర్తి వివరాల్లోకి వెళితే తిరుపతి పరిసర ప్రాంతంలోని జువైనల్ హోమ్ నందు ఓ బాలిక ఉంటోంది. అయితే ఈ బాలిక స్థానికంగా ఉన్న నెహ్రూ మున్సిపల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కాగా ఈ మధ్యకాలంలో రిషి అనే ఓ యువకుడు బాలిక రాకపోకలను గమనిస్తూ ఆమెపై కన్నేశాడు. ఈ క్రమంలో బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
అలాగే ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే తనని హత్య చేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక కిక్కురుమనకుండా ఉండిపోయింది. కానీ బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన కొందరు తోటి విద్యార్థులు ఏమైందని బాలికను అడగ్గా అసలు నిజం చెప్పింది. దీంతో విద్యార్థులు జువైనల్ సూపర్డెంట్ నయోమి కి తెలియజేశారు. అయితే నయోమి ఈ విషయం బయటికిపొక్కితే ఉద్యోగానికి ముప్పు వస్తుందని భావించి పై అధికారులకి తెలియకుండా దాచే ప్రయత్నం చేసింది.
కానీ జువైనల్ హోమ్ లో వైద్య చికిత్సలు నిర్వహించే డాక్టర్ ద్వారా ఈ విషయం బయటికి తెలియడంతో అధికారులు సూపర్డెంట్ నయోమి పై మండిపడ్డారు. అలాగే మైనర్ బాలికపై ఇంతటి దారుణానికి ఒడిగట్టిన యువకుడిపై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టాలని ఆదేశాలు జారీ చేసారు.