నిజామాబాద్ క్రైమ్, వెలుగు : లోన్ అప్రూవ్ అయిందంటూ ఓ వ్యక్తికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు అతడి అకౌంట్ నుంచి రూ. 1.40 లక్షలు కాజేశారు. నిజామాబాద్ టూటౌన్ ఎస్సై యాసిర్ అరాఫత్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ పట్టణంలోని బర్కత్‌పురకు చెందిన మహ్మద్ ముజాహిద్ అనే వ్యక్తికి సోమవారం ఓ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి ‘మీరు లోన్ కోసం అప్లై చేసుకున్నారు కదా.. నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా, మీ లోన్ అప్రూవ్ అయింది, నేను వీడియో కాల్ చేస్తా లిఫ్ట్ చేయండి’ అంటూ చెప్పాడు.
తర్వాత ముజాహిద్‌కు వీడియో కాల్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడాడు. వీడియో కాల్ చేసిన వ్యక్తి అడిగిన వివరాలు అన్నీ ముజాహిద్ చెప్పాడు. తర్వాత ముజాహిద్ అకౌంట్ నుంచి రూ. 1.40 లక్షలు కట్ అయ్యాయి. మోసపోయినట్లు గుర్తించిన ముజాహిద్ వెంటనే బర్కత్‌పుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరాఫత్ తెలిపారు.