నేషనల్‌‌ లోక్‌‌ అదాలత్​లో ఒక్క రోజే 14,18,637 కేసులు పరిష్కారం

నేషనల్‌‌ లోక్‌‌ అదాలత్​లో ఒక్క రోజే 14,18,637  కేసులు పరిష్కారం
  • రూ.911 కోట్ల పరిహార చెల్లింపు ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: జాతీయ లోక్‌‌ అదాలత్‌‌లో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో నిర్వహించిన లోక్‌‌ అదాలత్‌‌లకు కక్షిదారుల నుంచి భారీ స్పందన లభించింది. ఒక్క రోజులో 14,18,637 కేసులు పరిష్కారం అయ్యాయి. దీంతో కక్షిదారులకు రూ.911 కోట్లు పరిహారం చెల్లింపులకు ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన లోక్‌‌ అదాలత్‌‌లను జస్టిస్‌‌ అభినంద్‌‌ కుమార్‌‌ షావిలీ పర్యవేక్షించారు. వరంగల్, హనుమకొండలో లోక్‌‌ అదాలత్‌‌ను జస్టిస్‌‌ మౌషుమి భట్టాచార్య(వర్చువల్‌‌), జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌(ఫిజికల్‌‌) ప్రారంభించారు. అనంతరం ఏసీజే జస్టిస్‌‌ సుజోయ్‌‌పాల్, జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ కక్షిదారులకు పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ మేరకు కేసుల పరిష్కార వివరాలను రాష్ట్ర లీగల్‌‌ సర్వీసెస్‌‌ అథారిటీ సభ్యకార్యదర్శి సీహెచ్‌‌ పంచాక్షరి మీడియాకు విడుదల చేశారు.

హైకోర్టులో165 కేసుల పరిష్కారం

హైకోర్టు లీగల్‌‌ సర్వీసెస్‌‌ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన లోక్‌‌ అదాలత్‌‌లో 165 కేసులు పరిష్కారమయ్యాయి. న్యాయమూర్తులు జస్టిస్‌‌ అనిల్‌‌ కుమార్‌‌, జస్టిస్‌‌ నర్సింగరావులతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ 300 మందికి చెందిన 165 కేసులను పరిష్కరించారు.