- నిజామాబాద్ జిల్లాలో 1.42 లక్షల అప్లికేషన్లు
నిజామాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న నాలుగు స్కీంల కోసం నాలుగు రోజులపాటు నిర్వహించిన గ్రామ, వార్డు సభలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 21 నుంచి 24 దాకా మొత్తం 530 గ్రామసభలు, పట్టణాల్లో 146 వార్డు సభలు నిర్వహించి అర్హుల పేర్లను ఆఫీసర్లు చదివి వినిపించారు. అనర్హుల పేర్లు ఎక్కువగా ఉన్నాయని చాలా చోట్ల ప్రజలు నిరసనలు తెలిపి అధికారులను నిలదీశారు.
అర్హులందరికీ స్కీమ్ అందుతుందని, లిస్టులో పేర్లు రాని వారు గ్రామ/వార్డు సభలలో అప్లికేషన్లు పెట్టుకోవాలని ప్రభుత్వం సూచించింది. నిజామాబాద్ జిల్లాలో సుమారు 1.42 లక్షల మంది కొత్తగా దరఖాస్తులు చేసుకున్నారు. రేషన్ కార్డుల కోసం కొత్తగా 81,148, ఇందిరమ్మ ఇండ్ల కోసం 40,266, రైతు భరోసా కోసం 1,626, ఆత్మీయ భరోసా పథకానికి 19,305 మొత్తం అప్లికేషన్లు అందాయి.
కామారెడ్డి జిల్లాలో 1,03,938 దరఖాస్తులు
కామారెడ్డి, వెలుగు : ఈ నెల 21 నుంచి ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన గ్రామ, వార్డు సభలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సభల్లో నాలుగు స్కీమ్‌ల కోసం కామారెడ్డి జిల్లాలో 1,03, 938 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా కొత్త రేషన్ కార్డుల కోసం, ఇప్పటికే ఉన్నవాటిల్లో మార్పులు చేర్పుల కోసం వచ్చాయి. జిల్లాలో 535 గ్రామ సభలు, మున్సిపాలిటీల పరిధిలో 80 వార్డు సభలు నిర్వహించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ధరఖాస్తులు స్వీకరించారు.
గతంలో ధరఖాస్తులు చేసుకున్న వారి జాబితాను గ్రామ సభల్లో చదివి వినిపించారు. ఇందులో రాని వారు మళ్లీ అప్లైచేసుకున్నారు. కొత్త రేషన్ కార్డులు, మార్పులు, చేర్పుల కోసం 54,534, ఇందిరమ్మ ఇండ్ల కోసం 2,853, రైతు భరోసాకు 2,653, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 18,098 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.