మణిపుర్ రాష్ట్రంలో ఓ తెగకు చెందిన వారికి రిజర్వేషన్ కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ.. మరో తెగ వారు ప్రారంభించిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసి పదుల సంఖ్యలో మరణాలకు కారణమయ్యాయి. రెండు నెలల క్రితం ప్రారంభమైన ఈ హింసాకాండలో ఇప్పటి వరకు 142 మంది మృతి చెందారని మణిపుర్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించిన నివేదికను జులై 10 న అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టుకు సమర్పించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినీత్జోషి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో 5,995 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి, 6,745 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
అనంతర విచారణ నిమిత్తం ఆరు కేసులను దర్యాప్తు సంస్థ సీబీఐకు బదిలీ చేసినట్లు వెల్లడించారు. ఆ నివేదికలోని వివరాల ప్రకారం.. మే నుంచి దాదాపు 5 వేల హింసాత్మక ఘటనలు జరిగాయని, తూర్పు ఇంఫాల్, పడమర జిల్లాల్లో అధిక మరణాలు సంభవించినట్టు నివేదిక వెల్లడించింది. పరిస్థితులను బట్టి కర్ఫ్యూని పొడగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పునరావాస శిబిరాల్లోని విద్యార్థులను దగ్గర్లోని బడులకు వెళ్లే విధంగా ఏర్పట్లు చేస్తున్నట్లు చెప్పింది. బాధితులకు కల్పిస్తున్న పునరావాసం.. వారి రక్షణకుతీసుకుంటున్న చర్యలపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.