తెలంగాణలో మరో 1430 కరోనా కేసులు

తెలంగాణలో మరో 1430 కరోనా కేసులు

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 16,855 శాంపిల్స్ పరీక్షించగా 1430 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ఈ ఒక్క రోజే ఏడుగురు క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 47,705కి చేరింది. అలాగే క‌రోనా మృతుల సంఖ్య 429కి పెరిగింది. ఈ ఒక్క రోజులో 2062 మంది క‌రోనా నుంచి కోలుకున్నారని, దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాను జ‌యించిన వారి సంఖ్య 36,385కి చేరిందని ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. ప్ర‌స్తుతం 10,891 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొంది. గ‌డిచిన 24 గంట‌ల్లో అత్య‌ధికంగా ‌గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 703 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. రంగారెడ్డి జిల్లాలో 117, మేడ్చ‌ల్ జిల్లా‌లో 105, సంగారెడ్డి జిల్లాలో 50, నిజామాబాద్‌లో 48, నల్లగొండలో 45,  వరంగల్ అర్బన్‌లో 34, కరీంనగర్‌లో 27, మెదక్‌లో 26, వరంగల్ రూరల్‌లో 20 మంది చొప్పున క‌రోనా బారిన‌ప‌డ్డారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా రికవరీ రేటు 76 శాతానికి పెరిగిందని, మరణాల రేటు 0.89 శాతానికి తగ్గిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.