- జిల్లా కేంద్రంలో పోలీసుల కవాతు
మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు గురువారం 144 సెక్షన్ అమలు చేశారు. జిల్లా కేంద్రంలో కేటీఆర్ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహిస్తామని బీఆర్‌ఎస్ లీడర్లు గతంలో ప్రకటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లీడర్ల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతుందంటూ ధర్నాకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో బుధవారం రాత్రి బీఆర్‌ఎస్ లీడర్లు ఎస్పీ ఆఫీస్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో గురువారం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా కేంద్రంలో ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు.
ధర్నాను అడ్డుకోవడం అవివేకం
లగచర్ల గిరిజనులకు సంఘీభావంగా మహబూబాబాద్‌లో నిర్వహించతలపెట్టిన ధర్నాను కాంగ్రెస్‌లు నేతలు అడ్డుకోవడం అవివేకం అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. కాంగ్రెస్ లీడర్ల ఒత్తిడితో పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడం సరికాదన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ వస్తే రాళ్లతో కొడుతామని డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ బహిరంగంగా ప్రకటించారని, ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందన్నారు. మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ టి.రవీందర్‌రావు, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, బానోతు శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.