బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఏప్రిల్ 07న కరీంనగర్ జైలు నుంచి విడుదల కానున్నారు. దీంతో సీపీ సుబ్బారాయుడు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. నలుగురు కంటే ఎక్కువగా మంది సమావేశాలు,గుమిగూడడం నిషేదించారు. ర్యాలీలు, ధర్నాలకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. జైలు పరిసర ప్రాంతాలకు ఎవరూ రాకూడదని, ఎవరైనా వస్తే ముందస్తు చర్యల్లో భాగంగా ఆరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. దీనికి ప్రజలు సహకరించాలని సుబ్బారాయుడు కోరారు. అరెస్ట్ పై బండి సంజయ్ మాట్లాడే అవకాశం ఉంది. అటు బండి సంజయ్ కు బెయిల్ రావడంపై బీజేపీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
బండి సంజయ్‌కి హనుమకొండ కోర్టు ఏప్రిల్ 06 గురువారం రాత్రి సమయంలో బెయిల్ మంజూరు చేసింది. బెయిల్, పోలీస్ కస్టడీ పిటిషన్లపై గురువారం దాదాపు ఏడున్నర గంటలపాటు సుదీర్ఘ విచారణ జరిగింది. మధ్యాహ్నం రెండున్నరకు వాదనలు ప్రారంభం కాగా.. కోర్టులోని 18 మంది పీపీల్లో 13 మంది పోలీసుల తరఫున వాదించారు. వాదోపవాదాల అనంతరం రాత్రి 10 గంటల ప్రాంతంలో షరతులతో కూడిన బెయిల్‌ను ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ రాపోలు అనిత మంజూరు చేశారు. దీంతో పొద్దంతా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. టెన్త్ హిందీ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో సంజయ్‌తో పాటు బూరం ప్రశాంత్, గుండెబోయిన మహేశ్‌ను కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.