సింగరేణి కార్మికులకు రూ.1 వేయి 450 కోట్లు రిలీజ్​

  •    11వ వేజ్‌‌ బోర్డు బకాయిలు చెల్లించిన సంస్థ
  •    కార్మికుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ
  •    దసరా, దీపావళి బోనస్​లు సకాలంలో చెల్లిస్తం: డైరెక్టర్‌‌ బలరామ్‌‌ 

హైదరాబాద్‌‌, కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణి కార్మికులకు 11వ వేజ్ బోర్డు బకాయిలు రూ.1,450 కోట్లను సంస్థ గురువారం రిలీజ్​చేసింది. హైదరాబాద్ లోని సింగరేణి భవన్ నుంచి ఆన్​లైన్​లో 39, 413 మంది కార్మికుల బ్యాంకు ఖాతాల్లో నిధులను జమ చేసింది. స‌‌గ‌‌టున ఒక్కో కార్మికుడికి రూ.3 ల‌‌క్షల 70 వేలు అందాయి.  

కొందరికి 9 లక్షలపైనే..

రామగుండం 1 ఏరియాలో పనిచేస్తున్న  వేముల సుదర్శన్ రెడ్డి అనే సింగరేణి కార్మికుడికి అత్యధికంగా రూ.9.91 లక్షల ఎరియర్స్ దక్కాయి. రామగుండం 2 ఏరియాలో ఈఈపీ ఆపరేటర్​గా చేస్తున్న మీర్జా ఉస్మాన్ బేగ్  రూ.9.35 లక్షలు,  శ్రీరాంపూర్ ఏరియాలో పనిచేస్తున్న ఆడెపు రాజమల్లు రూ.9.16 లక్షలు అందుకున్నారు.  అన్ని ఏరియాల్లో అత్యధిక ఎరియర్స్ పొందిన ఉద్యోగులను జనరల్ మేనేజర్లు సన్మానించారు. 

ఇంత మొత్తం ఒకేసారి చెల్లించడం ఇదే తొలిసారి
 

ఒకేసారి ఇంత భారీ మొత్తం ఎరియర్స్ చెల్లించడం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారని డైరెక్టర్‌‌ బలరామ్‌‌ చెప్పారు. హైదరాబాద్‌‌ సింగరేణి భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 11వ వేజ్ బోర్డు జీతాలను కోల్ ఇండియా కంటే ముందే సింగరేణి సంస్థ అమలు చేసిందని తెలిపారు. ఎరియర్స్ లో ఇన్ కం ట్యాక్స్,  సీఎంపీఎఫ్, పెన్షన్  డబ్బులను మినహాయించి మిగిలిన మొత్తాన్ని కార్మికుల ఖాతాల్లో జమ చేసినట్టు చెప్పారు.

సీఎం కేసీఆర్‌‌ గతంలో ప్రకటించిన రూ.700 కోట్ల లాభాల బోనస్ ను  దసరాకు ముందే చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. దీపావళి బోనస్ గా పేర్కొనే పీఎల్‌‌ఆర్‌‌ ను కూడా ఆ పండుగకు ముందే చెల్లిస్తామన్నారు. ఈ సందర్భంగా  అత్యధిక ఎరియర్స్ పొందిన కార్మికులకు జీఎం కోఆర్డినేషర్​ ఎం.సురేశ్​తో కలిసి చెక్కులను అందజేశారు.

ఆఫీసర్స్‌‌ అసోసియేషన్‌‌ జనరల్ సెక్రటరీ, ఎన్ వీ.రాజశేఖర్ రావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.