బెజవాడ విషాదం : వరద తగ్గింది.. శవాలు తేలాయి.. 14 ఏళ్ల బాలుడు ఇలా..!

బుడమేరు వరద విజయవాడను అతలాకుతలం చేసింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు బుడమేరు వాగు ఉప్పొంగి నగరంపై పడటంతో విజయవాడ ప్రజలు నాలుగురోజుల పాటు నరకం చూశారు. బుధవారం నాటికి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇదిలా ఉండగా... ఊహించని విధంగా వచ్చిన వరద చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. వాడలకు సంబంధించిన దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. మనసుని కలిచివేస్తున్న అలాంటి వీడియోల్లో ఇది ఒకటి... విజయవాడలోని చిట్టి నగర్లో చోటు చేసుకుంది ఈ హృదయ విదారక ఘటన.

చిట్టినగర్ పరిధిలో 14 ఏళ్ల బాలుడు అదృశ్యమై వరద నీటిలో శవమై తేలాడు. మృతదేహాన్ని నడుములోతు నీటిలో తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొడుకుని తరలిస్తుండగా తల్లి రోదిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా అర్థాంతరంగా దూరమవాటాన్ని మించిన నరకం ఏ తల్లికి ఉండదని, ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

అంతే కాకుండా... విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి పదుల సంఖ్యలో మృతదేహాలను తరలించారు. పెద్ద దిక్కులను కోల్పోయిన కుటుంబ సభ్యులు, దిక్కు తోచని స్థితిలో చిన్నారులు ఇలా చాలా మంది 5 రోజులుగా మృతదేహాలు కోసం పడిగాపులు కాస్తున్నారు. రోజుల కొద్ది వరద నీళ్ళల్లో చిక్కుకొని ఉబ్బిపోయి డీకంపోజ్ అయిన మృతదేహాలు గుర్తు పట్టలేని స్థితిలో ఉండటం చూస్తే ఎంతటి రాతి గుండె అయినా కరగక మానదు.