- మున్సిపల్ చైర్మన్ తో సహా 15 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరిక
గద్వాల, వెలుగు : గద్వాలలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన గద్వాల మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ తో పాటు 15 మంది కౌన్సిలర్లు మంగళవారం సాయంత్రం కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కౌన్సిలర్లు మాణిక్యమ్మ, గీతమ్మ, జయమ్మ, శ్రీమన్నారాయణ, గిరిజా బాయి, బంగి ప్రియాంక, అనిత, నరహరి గౌడ్, మహేశ్వరి, నాగరాజు, సీను, మహేశ్, లక్ష్మి, అరుణ, కృష్ణ, రజక రాము, శ్వేత కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వారికి మంత్రి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
జడ్పీ చైర్పర్సన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్య ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ కు చెందిన ఒక ముఖ్య లీడర్ చక్రం తిప్పినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య పాత్ర పోషిస్తున్నాడని, దీనికి చెక్ పెట్టేందుకే ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లను పార్టీలో చేర్చుకునేందుకు స్కెచ్ వేశారని అంటున్నారు.
మునిగిపోతున్న నావ బీఆర్ఎస్ పార్టీ
వనపర్తి/కొల్లాపూర్/కోడేరు, వెలుగు : రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మునిగిపోతున్న నావలా తయారయిందని, అందులో ప్రయాణించడం ప్రమాదకరంగా భావించిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్వగ్రామం మంగంపల్లిలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. అహంకార ధోరణితో అంతా తామేనని వ్యవహరించిన బీఆర్ఎస్ నేతలకు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిని గెలిపించేందుకు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు సహకరించాలని కోరారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలో 117 మంది ఓటర్లుండగా, 100కు పైగా ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే కొల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు హైమవతి ఏళ్లగౌడ్, చిట్టెమ్మ రవి, అలివేలమ్మ కర్నె వాసు, పాన్ గల్ మండలం కేతేపల్లి, శాఖాపూర్, చింతకుంట, దావాజిపల్లి, కదిరేపాడు ఎంపీటీసీలు శ్యామల, సుబ్బయ్య యాదవ్, రమాదేవి, లక్ష్మీ నాయక్, నాగమ్మ మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు, చెన్నప్ రావుపల్లి, దేవుని తిరుమలాపూర్ ఎంపీటీసీలు తగిలి వెంకటస్వామి, రామచంద్రయ్య, ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.