- 26కు పెరిగిన కాంగ్రెస్ సంఖ్యాబలం
- త్వరలోనే అవిశ్వాసానికి రంగం సిద్ధం
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన15 మంది కౌన్సిలర్లు విడతల వారీగా హస్తం గూటికి చేరుకున్నారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొందరు సైతం కారు దిగేందుకు రెడీ అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్‌సాగర్‌రావు గెలవడం, రాష్ర్టంలో కొత్త సర్కారు కొలువుదీరడంతో వారం రోజుల్లోనే మంచిర్యాల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. నస్పూర్, లక్సెట్టిపేట మున్సిపాలిటీలకు చెందిన పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. త్వరలోనే అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టి మూడు మున్సిపాలిటీలను హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
పెరిగిన కాంగ్రెస్ బలం
మంచిర్యాల మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులున్నాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 22, కాంగ్రెస్14 సీట్లను గెల్చుకున్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్లో చేరారు. తాజా పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత విడతల వారీగా 15 మంది కారు దిగారు. మొత్తం 17 మంది కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ బలం 26కు పెరిగింది. 36 సీట్లకు గాను మ్యాజిక్ ఫిగర్19. దీంతో త్వరలోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
అలాగే నస్పూర్ మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులకు గాను కాంగ్రెస్‌కు ఆరుగురు కౌన్సిలర్లు ఉన్నారు. రెండ్రోజుల కిందట ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు సమక్షంలో వైస్‌చైర్మన్ శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరారు. మిగిలిన వారిలో మెజారిటీ సభ్యులు హస్తంలోకి జంప్ కానున్నారని సమాచారం.
కాంగ్రెస్‌లో చేరిన కౌన్సిలర్లు
మంచిర్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు చెందిన పలువురు కౌన్సిలర్లు గురువారం ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు సమక్షంలో హైదరాబాద్‌లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరిలో ప్రకాశ్‌నాయక్(7వ వార్డు), బొలివెట్టి సునీత (9వ వార్డు), వంగపల్లి అనిత (19వ వార్డు), మెరుగు మహేశ్వరి (22వ వార్డు), మీనాజ్ (25వ వార్డు), నాంపల్లి మాధవి (26వ వార్డు), సిరికొండ పద్మ (27వ వార్డు), మాదంశెట్టి సత్యనారాయణ (34వ వార్డు)తో పాటు బీఆర్ఎస్ నాయకులు ఖాజామియా, బోడ ధర్మేందర్, తూముల ప్రభాకర్ ఉన్నారు.
కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీసు అందజేత
మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్‌గౌడ్‌పై 26 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. శుక్రవారం కలెక్టర్ బదావత్ సంతోష్‌ను కలిసి నోటీసును అందజేశారు. మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులకు గాను బీఆర్ఎస్22, కాంగ్రెస్ 14 సీట్లు గెల్చుకున్నాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ బలం 26కు చేరింది. ప్రస్తుతం బీఆర్ఎస్లో మిగిలిన 10 మందిలో కూడా పలువురు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.
మొత్తం 36 సీట్లకు గాను మ్యాజిక్ ఫిగర్ 19 కాగా, ఇంకా ఏడుగురు ఎక్కువే ఉన్నారు. దీంతో చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ ముఖేశ్గౌడ్లపై అవిశ్వాసం తీర్మానం నెగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ రావుల ఉప్పలయ్యను, వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఓ సీనియర్ కౌన్సిలర్‌ను ఎన్నుకునేందుకు మంతనాలు జరుగుతున్నట్టు తెలిసింది. కలెక్టర్‌కు నోటీసు అందజేసిన అనంతరం కౌన్సిలర్లు హైదరాబాద్‌లో ఉన్న ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు వద్దకు బస్సులో బయల్దేరారు.