సూర్యాపేటలో బీఆర్‌‌‌‌ఎస్‌‌కు షాక్.. 15మంది కౌన్సిలర్ల రాజీనామా

సూర్యాపేట, వెలుగు :  పార్లమెంట్ ఎన్నికల ముందు సూర్యాపేటలో బీఆర్​ఎస్​కు గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 15మంది అసమ్మతి కౌన్సిలర్లు సోమవారం బీఆర్​ఎస్​కు రాజీనామా చేశారు. మున్సిపల్ ​చైర్ పర్సన్ అన్నపూర్ణ, వైస్ ​చైర్మన్ ​పుట్ట కిషోర్​పై బీఆర్​ఎస్​పార్టీ  అసమ్మతి కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టడంతో ఆదివారం ఇద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో మిగిలిన 13 మంది కూడా రిజైన్​ చేశారు.  సోమవారం వారు జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.

సూర్యాపేటలో అభివృద్ధి మాటున చేసిన అవినీతిని ప్రశ్నించినందుకే పార్టీ నుంచి బహిష్కరించారని 32వ వార్డు కౌన్సిలర్ కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి ఆరోపించారు. ఎదిగితే జగదీశ్​రెడ్డికి నచ్చదని,  వారిని అణచివేస్తారన్నారు. కనీసం తమ వార్డుల్లో జరిగిన అభివృద్ధి పనుల శిలాఫలకాలపై కూడా తమ పేర్లు పెట్టేందుకు అంగీకరించలేదన్నారు.

బీఆర్ఎస్​అహంకారానికి ప్రజలు గుణపాఠం చెప్పారని, ఇక్కడ కూడా అలాంటి సమయం వస్తుందన్నారు. జగదీశ్​ రెడ్డి మూడు సార్లు గెలిస్తే తమ వల్లే ఆయనకు మున్సిపాలిటీలో ఓట్లు పడ్డాయన్నారు. కౌన్సిలర్లు బచ్చలకూరి శ్రీనివాస్,  జహీర్, ఎలిమినేటి అభినయ్, అనపర్తి రాజేశ్​,  అనంతుల యాదగిరి, రాపర్తి శ్రీనివాస్, మామిడి గౌరయ్య, జ్యోతి కరుణాకర్, రవి నాయక్, నాయకులు గండూరి రమేశ్, లింగానాయక్,  సిరివెళ్ల శబరి,  కుంభం రాజేందర్, మకట్ లాల్ ఉన్నారు.