జోరుగా రోడ్ల రిపేర్లు..ఇప్పటికే ఆర్ అండ్ బీ రోడ్లకు 15 కోట్లు రిలీజ్

జోరుగా రోడ్ల రిపేర్లు..ఇప్పటికే ఆర్ అండ్ బీ రోడ్లకు 15 కోట్లు రిలీజ్
  • పంచాయతీ రాజ్ రోడ్లకు రూ.26 కోట్లు
  • కేంద్రం నుంచి మరికొన్ని నిధులు వచ్చే చాన్స్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో వర్షాలు, వరదలతో భారీగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. ఆర్ అండ్ బీ పరిధిలో 2,553 కిలోమీటర్లు మేర రోడ్లు దెబ్బతినగా సుమారు రూ.2,346 కోట్ల నష్టం వాటిల్లింది. బ్రిడ్జిలు, కల్వర్టులు, హైలెవల్  బ్రిడ్జిలు దెబ్బతినగా తాత్కాలిక రిపేర్లకు రూ.100 కోట్లు అవసరం అని ఆర్ అండ్ బీ అధికారులు ప్రభుత్వానికి వివరాలు పంపారు. 391 చిన్న బ్రిడ్జిలు, 199 హై లెవల్ బ్రిడ్జిలు, 85 కల్వర్టులు డ్యామేజ్  అయ్యాయని అంచనాలు రెడీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్  నిధుల నుంచి ఇటీవల ఆర్ అండ్ బీకి రూ.14.90 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్  చేసింది.

ఈ నిధులతో మైనర్  రిపేర్లతో పూర్తయ్యే రోడ్ల పనులను ప్రాధాన్యతా క్రమంలో తీసుకొని టెండర్లు పిలవగా పనులు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక ఇటీవల వరదలు, వర్షాల నష్టానికి రూ.416. 80 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో నుంచి కూడా కొన్ని నిధులను రోడ్ల రిపేర్లకు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు.

త్వరలో వాటి నుంచి కూడా నిధులు రానున్నాయి. ఇక వర్షాల సమయంలో జిల్లా కలెక్టర్లకు రూ.5 కోట్ల నిధులు ఇస్తున్నామని సీఎం ప్రకటించారు. ఈ నిధుల నుంచి కూడా కొన్ని నిధులు ఆర్ అండ్ బీకి వచ్చాయని, జిల్లాల్లో రోడ్ల మరమ్మతుల జరుగుతున్నాయని ఆర్ అండ్ బీ సీఈ మోహన్ నాయక్  తెలిపారు.

పీఆర్ రోడ్లకు 26 కోట్లు

రాష్ర్టంలో ఆర్ అండ్ బీ రోడ్ల కన్నా ఎక్కువగా పంచాయతీ రోడ్లు దెబ్బతిన్నాయని పీఆర్  ఇంజినీరింగ్  అధికారులు ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చారు. గ్రామాల మధ్య కనెక్టివిటీ దెబ్బతినడం, చెరువులకు భారీగా వరద నీరు చేరడం, చెరువు కట్టలు తెగడంతో గ్రామాల్లోకి నీళ్లు చేరాయి. సుమారు వారం పాటు ఒక గ్రామానికి మరో గ్రామానికి మధ్య రాకపోకలు నిలిచాయి. పొలాల నుంచి గ్రామాలకు వచ్చే మార్గంలో వాగులు, కల్వర్టులు సైతం భారీగా దెబ్బతిన్నాయి. రాష్ర్టంలో పంచాయతీ రాజ్ రోడ్లు 66,032 కిలోమీటర్లు దెబ్బతినగా.. 1,384 బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి.

తాత్కాలిక రిపేర్లకు రూ. 292 కోట్లు, శాశ్వత రిపేర్లకు రూ.5,033 కోట్లు అవసరమని పీఆర్  ఇంజినీరింగ్  అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ఇటీవల తాత్కాలిక మరమ్మతులకు ఆర్ అండ్ బీ కన్నా ఎక్కువ నిధులు కేటాయించాలని సీఎంను పంచాయతీ రాజ్  శాఖ మంత్రి సీతక్క కోరారు. దీంతో పీఆర్  రోడ్ల మరమ్మతుల కోసం రూ.26 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

వీటితో పాటు కలెక్టర్లకు ఇచ్చిన రూ.5 కోట్ల నుంచి రోడ్ల రిపేర్లకు నిధులు ఇవ్వాలని కలెక్టర్లను ఎమ్మెల్యేలు కోరడంతో కొన్ని నిధులు వచ్చాయని, రోడ్ల రిపేర్లు సాగుతున్నాయని పీఆర్  ఈఎన్సీ కనకరత్నం వెల్లడించారు. ఈ రోడ్లకు కూడా కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశముందని, ఫండ్స్  కేటాయించాలని మంత్రి సీతక్కను కోరామని ఆయన తెలిపారు.