
- రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు 15 రోజులు ట్రైనింగ్
- ఈ స్కీమ్ గేమ్ చేంజర్: డిప్యూటీ సీఎం భట్టి
- ప్రభుత్వం నుంచి రూ.6 వేల కోట్లు ఖర్చు.. లబ్ధిదారులకు 1,600 కోట్ల బ్యాంక్ లోన్లు
- లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా విడుదల చేయగానే బ్యాంకర్లు లింకేజీ మొత్తాన్ని రిలీజ్ చేయాలి
- సర్కార్ ఇచ్చే సబ్సిడీని లోన్లు, ఈఎంఐల కింద పట్టుకోవద్దు
- బ్యాంకర్లతో సమావేశంలో సూచన
హైదరాబాద్, వెలుగు: రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కు బ్యాంకర్లు సహకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ఈ స్కీమ్‌ను సాధారణ సంక్షేమ పథకంలా చూడొద్దని, దీని వల్ల యువత జీవితాల్లో మార్పురావడంతో పాటు రాష్ట్ర సంపద కూడా పెరుగుతుందని ఆయన తెలిపారు. అందుకే రాజీవ్‌యువ వికాసం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 6 వేల కోట్ల దాకా ఖర్చు పెట్టబోతున్నదని.. లబ్ధిదారులకు బ్యాంకర్లు లోన్ల రూపంలో 1,600 కోట్లు ఇచ్చేందుకు ముందుకు రావాలని ఆయన సూచించారు. ఈ స్కీమ్ కింద లబ్ధి పొందేవారికి వ్యాపారం చేసుకోవడం, లాభాలు సాధించడంపై అధికారులు కనీసం మూడు రోజుల నుంచి 15 రోజుల వరకు శిక్షణ ఇస్తారని డిప్యూటీ సీఎం వెల్లడించారు.
వ్యాపారంలో ఇబ్బందులు ఏర్పడితే శిక్షణ సంస్థలు మద్దతు ఇస్తాయని బ్యాంకర్లకు ఆయన వివరించారు. రాజీవ్ యువ వికాసం పథకం అమలుపై బుధవారం ప్రజా భవన్ బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు సుదీర్ఘ సమావేశాలు నిర్వహించి మానవీయ కోణంలో రాజీవ్ యువ వికాసానికి రూపకల్పన చేశారని వివరించారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఇంత పెద్ద మొత్తంలో స్వయం ఉపాధి పథకాలకు ఏనాడూ ఏ ప్రభుత్వమూ కేటాయింపులు చేయలేదని తెలిపారు. కొలువుల కోసం కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత పదేండ్ల పాటు నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదని అన్నారు. ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తూనే మిగిలిపోయిన నిరుద్యోగుల కోసం ఈ స్వయం ఉపాధి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. ‘‘స్కీమ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 6,000 కోట్లు ఖర్చు పెడ్తున్నది. బ్యాంకర్లు రూ. 1,600 కోట్లు లింకేజీ ఇచ్చేందుకు ముందుకు రావాలి. లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా విడుదల చేయగానే, బ్యాంకర్లు లింకేజీ మొత్తాన్ని రిలీజ్చేయాలి. అలాగే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని లబ్ధిదారులకు అందజేయాలి.. దాన్ని లోన్లు, ఈఎంఐల కింద పట్టుకోవద్దు” అని ఆయన చెప్పారు.
రెండు దశల్లో సబ్సిడీ
రాజీవ్ యువ వికాసం కింద రెండు దశలలో సబ్సిడీ రిలీజ్ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. స్కీమ్ మంజూరైన తర్వాత కొంత మొత్తం.. ఆ తర్వాత స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటు చేసుకున్నాక మిగిలిన మొత్తం రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, ఎస్టీ సంక్షేమ శాఖ సెక్రటరీ శరత్, బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీధర్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
పరస్పరం సహకరించుకోవాలి
రాజీవ్ యువ వికాసం ద్వారా ఆర్థికంగా, సామాజికంగా రాష్ట్రంలోని యువతకు సహాయపడేందుకు బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని, పథకంలో బ్యాంకర్లు ఉత్సాహంగా పాల్గొనాలని, దీని ద్వారా బ్యాంకర్లకు మంచి పేరు దక్కుతుందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో కమర్షియల్ బ్యాంకులు మాత్రమే ఉంటాయని, మరికొన్ని ప్రాంతాల్లో రూరల్ బ్యాంకులు ఉంటాయని, ఈ పథకం విజయవంతం చేసేందుకు బ్యాంకర్లు పరస్పరం సహకరించుకోవాలన్నారు. పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్లు బ్యాంకర్లతో త్వరలో సమావేశం నిర్వహించాలని ఆయన ఆదేశించారు. అర్హులకు శాంక్షన్ లెటర్లు అందజేసిన తర్వాత రాష్ట్రస్థాయిలో మరోసారి ఎస్ఎల్ బీసీ సమావేశం నిర్వహిస్తామన్నారు. రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగుల జీవితాలు మారుతాయని, వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ పథకం ఒక గేమ్ ఛేంజర్ గా మిగులుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.