హౌతీలు ప్రయోగించిన 15 డ్రోన్లు కూల్చివేత

వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో అమెరికా వాణిజ్య నౌకలతో పాటు మరికొన్ని యుద్ధ నౌకలపై హౌతీ రెబెల్స్  వరుసగా 15 డ్రోన్లు ప్రయోగించగా..వాటన్నింటినీ యూఎస్, మిత్రపక్ష బలగాలు కూల్చిపారేశాయి. అమెరికా నౌకలపై డ్రోన్లు ప్రయోగించింది తామే అని హౌతీ రెబెల్స్ ప్రకటించారు. నిరుడు ఇజ్రాయెల్–పాలస్తీనా మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పాలస్తీనా ప్రజలకు మద్దతుగా హౌతీలు ఎర్ర సముద్రంలో  నౌకలపై దాడులు చేస్తున్నారు. 

ఒకేసారి 15 డ్రోన్లను ప్రయోగించడం మాత్రం ఇదే మొదటిసారి. శనివారం తెల్లవారుజామున హౌతీ రెబెల్స్  డ్రోన్లు ప్రయోగించారని ఈ మేరకు అమెరికా సెంట్రల్  కమాండ్  ట్విటర్ లో వెల్లడించింది. తమ దేశ వాణిజ్య నౌకలతో పాటు మిత్రపక్షాలకు చెందిన నౌకల వైపు ఆ డ్రోన్లు దూసుకువస్తుండగా కూల్చివేశామని తెలిపాయి. ఆ డ్రోన్లను షూట్  చేసి ఉండకపోయుంటే భారీ విధ్వంసం జరిగేదని పేర్కొన్నాయి.