- సూర్యాపేటలో లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు కూలీలు స్పాట్ డెడ్
- మెదక్‌లో బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి, జగిత్యాలలో బైకులు ఢీకొని ముగ్గురు
- జనగాంలో కారు, డీసీఎం ఢీకొని ఇద్దరు.. పెద్దపల్లిలో బైక్, బొలేరో ఢీకొని మరో ఇద్దరు
- జడ్చర్ల సమీపంలో హైవేపై ట్రావెల్ బస్సు, లారీ ఢీ.. ఇద్దరు మృత్యువాత
వెలుగు నెట్వర్క్: రాష్ట్రంలో శుక్రవారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 15 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లాలో అతివేగంగా వస్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి ఇసుక లారీని ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురం గ్రామ శివారు ఆంగోతుతండా సమీపంలో హైదరాబాద్-– ఖమ్మం రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగింది.
ఒడిశా రాష్ట్రానికి చెందిన 33 మంది కూలీలు హైదరాబాద్‌లో కూలి పనుల కోసం గురువారం మధ్యాహ్నం 4 గంటలకు చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన గుప్త ట్రావెల్స్ బస్సులో బయలు దేరారు. బస్సు చివ్వెంల మండలం ఐలాపురం గ్రామ శివారులోకి రాగానే.. టైర్ పంక్చర్ అయి, రోడ్డు పక్కన ఆగి ఉన్న ఇసుక లారీని ఢీకొట్టింది. దీంతో ఒడిశా రాష్ట్రంలోని నవరంగాపుర్ జిల్లా లొహరికన్ని గ్రామానికి చెందిన బస్సు డ్రైవర్ గరుడ సునీల్(40), అదే రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లా కమట గ్రామానికి చెందిన రూపు హరిజన్(51), అతడి భార్య సుల హరిజన్(46), అదే గ్రామానికి చెందిన సునమని హరిజన్(61) అక్కడిక్కడే మృతి చెందారు.
ప్రత్యూష్ ప్రభాత్ హరిజన్(17) చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మరో19 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో జనరల్ ఆసుపత్రికి పంపించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డుపైనే డ్రైవర్ కాలు
సూర్యాపేటలో ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ గరుడ సునీల్ కాలు ఇంజిన్ లో ఇరుక్కుపోయి తెగిపోయింది. పోలీసులు గమనించకుండా.. తెగిపోయిన కాలును ఘటనా స్థలంలోనే వదిలి వెళ్లిపోయారు. సాయంత్రం వరకు అది రోడ్డు పై పడి ఉండగా.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు తెగిపడ్డ కాలును తీసుకెళ్లారు.
జగిత్యాలలోని ధర్మపురి నేషనల్ హైవేపై..
జగిత్యాల జిల్లాలోని తక్కళ్లపల్లి- -–అనంతారం మధ్య లో రెండు బైక్ లు ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతూ కన్నుమూశారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన బత్తుల సాయి (20), బూతగడ్డ అరవింద్ (20) సోమన్ పల్లి లో బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్నారు.
తక్కళ్ల పళ్లి గ్రామ శివారులో కొండాపూర్ గ్రామానికి చెందిన దయాల వంశీ (22) బైక్ ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో బూతగడ్డ అరవింద్, దయాల వంశీ స్పాట్ లోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సాయి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
బైక్‌ను ఢీకొట్టిన బొలేరో
పెద్దపల్లి జిల్లా రంగాపూర్ లో బైక్‌ను బొలేరో వెహికల్ ఢీకొట్టగా.. ఇద్దరు యువకులు మృతిచెందారు. అప్పన్నపేటకు చెందిన అభినయ్ (22), మంగపేటకు చెందిన చుంచు రాజకుమార్ (21) మంథని నుంచి బైకుపై పెద్దపల్లి వైపు వస్తుండగా బొలేరో వాహనం ఢీకొట్టింది. చుంచు రాజ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అభినయ్‌ను దవాఖానకు తరలిస్తుండగా.. మార్గ మధ్యంలో చనిపోయాడు. బొలేరో డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
జడ్చర్లలో ఇద్దరు మృతి
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు శుక్రవారం రాత్రి 10 కి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్యాసింజర్లతో బయల్దేరింది. జడ్చర్ల వద్ద ముందు వెళ్తున్న కారుతోపాటు రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దాంతో బస్సు ముందు సీట్లో కూర్చున్న ఇద్దరు మృతి చెందారు. బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా..ట్రీట్మెంట్ కోసం మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.
యాక్సిడెంట్లో క్లోజ్ ఫ్రెండ్స్ మృతి
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ మృతిచెందారు. శివ్వంపేట మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్(30), నాగరాజు(32) పనిమీద కొంపల్లి వెళ్లి.. తిరిగి వస్తుండగా హైదరాబాద్-–మెదక్ నేషనల్ హైవే పై ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో వారి బైక్‌ను లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ స్పాట్లో నే కన్నుమూశారు. ఇద్దరికీ భార్య, పిల్లలు ఉన్నారు. మృతుడి బంధువుల కంప్లయింట్ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు నర్సాపూర్ ఎస్సై లింగం తెలిపారు.
మనవడి బారసాలకు వెళ్లొస్తూ..
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం ఈటూరు గ్రామానికి చెందిన పేరాల వెంకన్న(45) తన కుమారుడికి కొడుకు పుట్టగా.. బారసాల కోసమని కోడలి పుట్టిల్లు జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని కడవెండి గ్రామానికి తుఫాన్ వెహికల్లో కుటుంబంతో కలిసి వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత గురువారం రాత్రి తిరుగు పయనమయ్యారు.
జనగామ జిల్లా సూర్యాపేట హైవే పైకి ఎక్కిన తుఫాన్ వెహికల్.. కొడకండ్ల మండలం మైదం చెరువుతండా సమీపంలో ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో తుఫాన్ వెహికల్లో ఉన్న వెంకన్నతోపాటు ఆయన తమ్ముడి భార్య జ్యోతి (35)స్పాట్లోనే చనిపోయారు.