మూసీ నది సుందరికీరణ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను వేగవంతం చేసింది. ఇప్పటికే మూసీ పరీవాహక ప్రాంతాలను సర్వే చేసిన అధికారులు తాజాగా మూసీపై నిజాం కాలంలో 58 కిలోమీటర్ల పొడవున నిర్మించిన17 బ్రిడ్జిల పటిష్టతపై పరీక్షలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దశాబ్ధాల కింద నిర్మించిన ఈ బ్రిడ్జిలు స్ట్రాంగ్‌గా ఉన్నాయా లేవా.. ఇంకా ఎంత కాలం తట్టుకుని నిలబడగలవు.. లాంటి అంశాలను పరిశీలించడానికి ప్రభుత్వం ఓ ఏజెన్సీని నియమించింది.
ప్రభుత్వం నియమించిన సదరు ఏజెన్సీ మూసీపై నిర్మించిన బ్రిడ్జిల్లో నయాపూల్(పాతది, కొత్తది), పురాణాపూల్(పాతది,కొత్తది), నాగోల్ (ఓల్డ్ అండ్ న్యూ), ఇమ్లిబన్( ఇన్ అండ్ ఔట్), ముస్లింజంగ్(ఓల్డ్ అండ్ న్యూ), టిప్పు ఖాన్(ఓల్డ్ అండ్న్యూ), బాపూఘాట్, సాలార్జంగ్, అత్తాపూర్, చాదర్‌ఘాట్, గోల్నాక బ్రిడ్జిలను పరిశీలించనుంది. ఈ బ్రిడ్జిలు నిజాం కాలంలో నిర్మించినవి కావడం, చారిత్రక నేపథ్యం ఉండడంతో లోపాలు ఉంటే కూల్చడం కంటే..వారసత్వ కట్టడాలుగా భావించి రిపేర్లు చేయడంపైనే దృష్టి సారిస్తోంది ప్రభుత్వం.
బ్రిడ్జిల పటిష్టత పరీక్షలు నిర్వహించేందుకు పలు కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానించి ముంబైకి చెందిన స్ట్రక్ట్ వెల్ డిజైనర్స్ అండ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా బ్రిడ్జిల పటిష్టతను పరిశీలించడానికి సదరు కంపెనీ రీబౌండ్ హ్యామర్ టెస్ట్, గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్, డైనమిక్ లోడ్ టెస్టింగ్స్నిర్వహించనున్నది. రెండు నెలల్లో ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వనుంది.