యాదాద్రిలో 15, సూర్యాపేటలో 18 మంది విధుల్లోకి..

యాదాద్రి, వెలుగు :  సమ్మె విరమించకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయినా సెక్రటరీలు వెనకడుగు వేయడం లేదు. దీంతో వారిని సమ్మె విరమించేలా చేయడానికి ఎంపీడీవోలు, ఎంపీవోలను రంగంలోకి దింపింది. మండలాల వారీగా ఎంపీడీవో, ఎంపీవోలు ఎవరికి వారు పంచాయతీ సెక్రటరీలతో చర్చలు జరిపారు. దీంతో డిస్ట్రిక్​ పంచాయతీ హయ్యర్​ ఆఫీసర్లు కూడా చర్చించి విఫలమయ్యారు. 

సెక్రటరీలతో కలెక్టర్​ చర్చలు

పంచాయతీ సెక్రటరీలను సమ్మె విరమింప చేయడానికి యాదాద్రి కలెక్టర్​ పమేలా సత్పతి ప్రయత్నించారు. కలెక్టరేట్​ ఎదురుగా నిరసన దీక్ష చేస్తున్న పంచాయతీ  సెక్రటరీల తరపున ప్రతినిధులను కలెక్టర్​ మంగళవారం చర్చలకు ఆహ్వానించారు. దీంతో సెక్రటరీల తరపున దాదాపు 15 మంది కలెక్టర్​ వద్దకు వచ్చారు. తాము సమ్మెకు దిగిన కారణాలను సెక్రటరీలు వివరించారు. వారు చెప్పిన కారణాలను విన్న కలెక్టర్ సమ్మె విరమించాలని నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. తాము  మిగిలిన వారితో చర్చించి 15 నిమిషాల్లో  నిర్ణయం చెబుతామని సెక్రటరీలు తెలిపారు. కలెక్టర్​ అందుకు సమ్మతించి సెక్రటరీల నిర్ణయం కోసం ఎదురు చూసినా వెళ్లిన వారు తిరిగి రాలేదు. 

కొందరు విధుల్లో చేరిన్రు.. 

విధులకు హాజరు కావాలని మంగళవారం ఎంపీడీవోలు, ఎంపీవోలు ఫోన్లు చేయడం, ఉద్యోగానికి ప్రమాదమంటూ హెచ్చరించారు. దీంతో మంగళవారం మరో 15 మంది పంచాయతీ సెక్రటరీలు విధుల్లో చేరారు. వీరిలో ఇద్దరు ఔట్​ సోర్సింగ్​ సెక్రటరీలు ఉన్నారు. కాగా సోమవారం విధుల్లో చేరిన 15 మంది సెక్రటరీల్లో ఐదుగురు తిరిగి సమ్మెలోకి వెళ్లారు. దీంతో మొత్తంగా జిల్లాలో 27 మంది సెక్రటరీలు విధుల్లో చేరారు. కాగా సమ్మె చేస్తున్న పంచాయతీ సెక్రటరీలు మంగళవారం కూడా కలెక్టరేట్​ ఎదురుగా ధర్నా చౌక్​లో నిరనన దీక్ష కొనసాగించారు. వీరి దీక్షకు టీపీసీసీ జనరల్​ సెక్రటరీ బీర్ల అయిలయ్య మద్దతు పలికారు. 

సూర్యాపేటలో18మంది... 
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలో మంగళవారం 18మంది పంచాయతీ కార్యదర్శులు తిరిగి విధుల్లో చేరారు. విధుల్లో చేరాలని ప్రభుత్వం మంగళవారం సాయంత్రం 5గంటల వరకు డెడ్ లైన్ విధించింది. విధుల్లో చేరని పంచాయతీ కార్యదర్శులని ఉద్యోగం నుంచి తొలగిస్తామని నోటీసులు జారీ చేసింది. దీనితో మంగళవారం సాయంత్రం వరకు 11మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శిలు, ఏడుగురు ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరారు.