రెండు చోట్ల ప్రమాదాలు.. ఒకరు మృతి, 38 మందికి గాయాలు

రెండు చోట్ల ప్రమాదాలు.. ఒకరు మృతి, 38 మందికి గాయాలు
  • ఖమ్మం జిల్లాలో అదుపుతప్పి కాల్వలో పడిన ట్రాక్టర్‌‌‌‌
  • మహిళ మృతి,మరో 23 మందికి తీవ్ర గాయాలు 
  • రాజన్నసిరిసిల్ల జిల్లాలో బ్రేక్‌‌‌‌లు ఫెయిల్‌‌‌‌ కావడంతో పొలంలోకి దూసుకెళ్లిన బస్సు
  • 15 మంది ప్రయాణికులకు గాయాలు

మధిర/రాజన్నసిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట, వెలుగు : ఖమ్మం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం జరిగిన ప్రమాదాల్లో ఒకరు చనిపోగా, మరో 38 మందికి గాయాలు అయ్యాయి. ఖమ్మం జిల్లాలో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోనకల్‌ సమీపంలో అదుపుతప్పి కాల్వలో పడడంతో మహిళ అక్కడికక్కడే చనిపోగా, 23 మంది గాయపడ్డారు. సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లడంతో అందులో ఉన్న 15 మందికి గాయాలు అయ్యాయి. 

ఖమ్మం జిల్లాలో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి..

ఖమ్మం జిల్లా బోనకల్‌ గ్రామానికి చెందిన చెందిన 25 మంది కూలీలు ట్రాక్టర్‌లో ఏపీలోని వత్సవాయి మండలం లింగాల గ్రామంలో మిర్చి ఏరేందుకు బయలుదేరారు. బోనకల్‌ సమీపంలోని ఎన్‌ఎస్పీ కాల్వ బ్రిడ్జి వద్దకు రాగానే డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో ట్రాక్టర్‌ ట్రాలీ అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలో పడిపోయింది.

దీంతో బోనకల్‌ గ్రామానికి చెందిన యార్లగడ్డ వరమ్మ (60) అక్కడికక్కడే చనిపోగా, మోర్ల రేణుక, భూక్య చాంబ్రీ, పసల త్రివేణితో పాటు మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన వారిని 108లో ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుబాబు తెలిపారు. గాయపడిన వారిని జడ్పీ మాజీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, మధిర మాజీఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు పరామర్శించారు. ట్రాక్టర్‌ ప్రమాదంలో చనిపోయిన వరమ్మ ఫ్యామిలీకి రూ. 20 లక్షలు, గాయపడిన వారికి రూ. 10 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

మెరుగైన వైద్యం అందించాలి : డిప్యూపీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి

ట్రాక్టర్‌ ప్రమాదం విషయం తెలియడంతో గాయపడిన వారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. చనిపోయిన యార్లగడ్డ వరమ్మ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. చనిపోయిన వరమ్మ ఫ్యామిలీకి సానుభూతి తెలిపారు.

పొలంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు 

ఆర్టీసీ బస్సు బ్రేక్‌లు ఫెయిల్‌ కావడంతో అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. పొలంలో బురద కారణంగా బస్సు ఆగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళ్తే... కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 60 మంది ప్రయాణికులతో శుక్రవారం కామారెడ్డి నుంచి సిరిసిల్లకు వెళ్తోంది.

ఈ క్రమంలో గోరంటాల శివారులో బ్రిడ్జి వద్దకు రాగానే బ్రేకులు ఫెయిల్‌ కావడంతో డ్రైవర్‌ బస్సును అదుపు చేయలేకపోయాడు. దీంతో బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. గమనించిన స్థానికులు ఘటనాస్థలానికి చేరుకొని ప్రయాణికులను కిందకు దించారు. గాయపడిన వారిని సిరిసిల్ల హాస్పిటల్‌కు తరలించారు. ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న క్షతగాత్రులను కలెక్టర్ సందీప్‌ కుమార్‌ ఝూ పరామర్శించారు.