లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొని 15 మందికి గాయాలు

  • స్పీడ్ ​బ్రేకర్ ​దగ్గర బ్రేక్​ వేసిన లారీ
  • కంట్రోల్ ​కాకపోవడంతో వెనక నుంచి ఢీకొట్టిన బస్సు  
  • కరీంనగర్​ జిల్లా మానకొండూరులో ప్రమాదం

మానకొండూర్, వెలుగు: కరీంనగర్​జిల్లా మానకొండూరు పీఎస్​ సమీపంలోని వరుణ్​ సీడ్స్​ దగ్గర మంగళవారం లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కండక్టర్ గుట్టిగుండ్ల వెంకన్న కథనం ప్రకారం.. సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేములవాడ నుంచి సూర్యాపేటకు బయల్దేరింది. కరీంనగర్ దాటాక మానకొండూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో కరీంనగర్–వరంగల్ మెయిన్ ​రోడ్డుపై ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయని స్పీడ్ తగ్గించాడు. దీంతో వెనకాల వస్తున్న ఆర్టీసీ బస్సు కంట్రోల్ తప్పి ముందున్న లారీని ఢీకొట్టింది. బస్సులో 35మంది ప్రయాణికులుండగా 15 మందికి గాయాలయ్యాయి.  వీరిని 108లో కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. డ్రైవర్ ఎం.మల్లయ్య బస్సు క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. దీంతో పోలీసులు గ్యాస్​కట్టర్​ఉపయోగించి ఆయనను బయటికి తీసి కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.  

ఇంట్లోకి దూసుకెళ్లిన వ్యాన్..తప్పిన ప్రమాదం

మెట్ పల్లి : మెట్ పల్లి మండలం వెల్లుల్లలో మంగళవారం ధాన్యం తరలిస్తున్న ఓ వ్యాన్​ అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లి గోడను ఢీకొట్టి ఆగిపోయింది. స్థానికుల కథనం ప్రకారం..మండలంలోని ఓ గ్రామం నుంచి మెట్ పల్లికి ధాన్యం తీసుకెళ్తున్న వ్యాన్ వెల్లుల్ల లోకి రాగానే అదుపుతప్పి పక్కనున్న చెట్టును ఢీ కొట్టి బొబ్బిలి సాయమ్మ ఇంట్లోకి దూసుకెళ్లింది. దీంతో ఇంటి గోడ కూలిపోయింది. ఆ టైంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సాయమ్మ కొడుకు ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లడంతో కోడలితో కలిసి సాయమ్మ ఆ ఇంట్లోనే ఉంటోంది.